బాధితులకు కంటితుడుపుగా కాకుండా శాశ్వత పరిహారం చెల్లించండి: సోనూ సూద్‌ డిమాండ్‌

3 Jun, 2023 20:27 IST|Sakshi

ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశాడు రియల్ హీరో సోనూ సూద్‌. ఈ ప్రమాదం చాలా దారుణమని ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా సందేశాన్ని కూడా పంపించాడు. 

రియల్ హీరో... 
ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండే సోనూ సూద్‌ ఇప్పుడు రైలు ప్రమాద బాధితుల పక్షాన నిలిచి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. బాధిత కుటుంబాలకు కంటితుడుపు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా శాశ్వత పరిహారం చెల్లించే విధంగా సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బాలాసోర్ రైలు ప్రమాదంపై తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు. 

ఒడిశాలో జరిగిన విషాదం గురించి తెలియగానే నా గుండె చెక్కలైంది. ప్రమాద బాధితులకు నా ప్రగాఢ సానుభూతులు తెలుపుతున్నాను. మనమందరం వారి కుటుంబాలకు అండగా ఉండాలని రాస్తూనే... వీడియో ద్వారా సందేశాన్ని పంపించాడు.  

వీడియోలో సోనూ ఏమన్నాడంటే...
మనం ఈరోజు ప్రమాదం గురించి ట్వీట్ చేస్తాం, సంఘటనలో నష్టపోయిన నిర్భాగ్యుల పట్ల సానుభూతి తెలుపుతాం. కానీ వెంటనే మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కానీ వీరిలో జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలలో పనులు చేసుకుంటున్న వారి పరిస్థితి ఏమిటి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? రాత్రికి రాత్రి చాలా కుటుంబాలు చెదిరిపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడే అవకాశముందా? ఇప్పుడు ప్రకటించిన నష్టపరిహారం రెండు మూడు నెలల్లో ఖర్చయిపోతుంది. 

ఈ ఘటనలో తమ కుటుంబాలను పోషించుకునే అనేకమంది కాళ్ళు, చేతులు విరిగిపోయాయి. ఈ పరిహారంతో వారికి న్యాయం జరుగుతుందా? ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమే కానీ ఇటువంటి విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఎదో నష్టపరిహారం ప్రకటించి ఊరుకోకుండా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పెన్షన్లు ఇవ్వడంగానీ స్థిరాదాయం కల్పించడం గానీ చేస్తే మంచిదని నా అభిప్రాయం. 

ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునరాలోచన చేసి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు భరోసా కల్పించాలి. అలాగే ప్రతి ఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు.  

ఇది కూడా చదవండి: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడిన విధి.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత..

మరిన్ని వార్తలు