అవినీతి తిమింగలం.. కోటి విలువైన ఇళ్లు.. వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌.. 

12 May, 2023 17:20 IST|Sakshi

భోపాల్‌: హేమా మీనా.. ఈమె ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగి. నెలకు జీతం రూ. 30వేలు. కానీ, మీనా ఆస్తులు చిట్టా చూసి అధికారులు షాకయ్యారు. 7 లగ్జరీ కార్లు, రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్‌ అత్యాధునిక టీవీ, విలాసవంతమైన భవనాన్ని అధికారులు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు సోదాలు నిర్వహించగా ఆమె ఆస్తుల వివరాలు చూసి నివ్వెరపోయారు. ఈ నేపథ్యంలో హేమపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా హేమా మీనా పనిచేస్తోంది. కాగా, ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు గుర్తించిన లోకాయుక్త అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో భోపాల్‌లోని హేమా మీనా నివాసంలో లోకాయుక్త అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. అంతేకాకుండా సుమారు 20 వాహనాలు హేమా మీనా కొనుగోలు చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అందులో ట్రాక్టర్లు, వరి నాట్లు యంత్రాలు, హార్వెస్టర్లు, అనేక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. కాంట్రాక్ట్‌ ఉద్యోగి అయిన హేమా మీనా నెల జీతం కేవలం రూ.30 వేలు మాత్రమే. ఆమె జీతంతో పోలిస్తే ఆస్తుల విలువ 232 శాతం ఎక్కువ. సోదాల సందర్బంగా 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్‌ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్‌ అత్యాధునిక టీవీని అధికారులు గుర్తించారు. హేమా తన తండ్రి పేరుమీద 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేసి అందులో రూ.కోటి వెచ్చించి విలాసవంతమైన ఇంటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌, మొబైల్‌ జామర్‌లు, ఇతర విలువైన వస్తువులు కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని ఆస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: బెంగాల్‌, తమిళనాడు సర్కార్‌కు బిగ్‌ షాక్

మరిన్ని వార్తలు