Wrestlers Protest: రైతు నేతల విజ్ఞప్తి.. పతకాలు గంగానదిలో వేయడం వాయిదా.. కేంద్రానికి 5 రోజుల గడువు

30 May, 2023 20:03 IST|Sakshi

న్యూఢిల్లీ: హరిద్వార్‌ వద్ద గంగానదిలో పతకాలను విసిరేస్తామన్న రెజ్లర్లు.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. రైతు నేతల విజ్ఞప్తితో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు కేంద్రానికి అయిదు రోజుల గడువిస్తూ అల్టీమేటం జారీ చేశారు. అయిదు రోజుల్లో బ్రిజ్‌ భూషన్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మళ్లీ తిరిగి వస్తామని తెలిపారు. రెజ్లర్ల పతకాలను రైతు నేత నరేష్‌ తన వెంట తీసుకెళ్లారు.

కాగా  బీజేపీ ఎంపీ  రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరన్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరు నెలల నుంచి ఢిల్లీలో నిరసన చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తాము కష్టపడి గెలుచుకున్న మెడల్స్‌ను పవిత్ర గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు విసిరేస్తామని ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేస్తామని తెలిపారు.

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు.కాబట్టి ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో నిరసనగా తమ పతకాలను నదిలో వేయడానికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని గంగా నది తీరానికి చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు అక్కడే ధర్నాకు దిగారు.

అయితే రెజ్లర్లు పతకాలను గంగా నదిలోకి విసిరేందుకు సిద్ధమవుతున్న వేళ రైతు నాయకుడు నరేష్ టికాయత్‌ హరిద్వార్ హర్ కి పౌరీకి చేరుకున్నారు. ఆయన జోక్యం చేసుకొని పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయొద్దని నిరసన తెలుపుతున్న మల్లయోధులను కోరారు. దీంతో తమ నిర్ణయాన్ని రెజ్లర్లు వాయిదా వేసుకున్నారు. హరిద్వార్‌లోని హర్‌ కీ పౌరి నుంచి వెనక్కి బయల్దేరారు. కాగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్నారు.
చదవండి: మణిపూర్‌లో అమిత్‌ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం 

మరిన్ని వార్తలు