సుప్రీంలో బిల్కిస్‌ బానోకు చుక్కెదురు.. దోషుల విడుదలపై రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

17 Dec, 2022 13:01 IST|Sakshi

న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, దోషుల విడుదలపై పోరాడుతున్న బాధితురాలు బిల్కిస్‌ బానోకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దోషులను విడుదల చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన, తమ కుటుంబ సభ్యులను హత్య చేసిన వారిని విడుదల చేయడంపై రెండు వేర్వేరు పిటిషన్ల ద్వారా సవాల్‌ చేసింది. అందులో ఒకటి దోషులకు రెమిషన్‌ పాలసీని అమలు చేసేందుకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని పిటిషన్‌ దాఖలు చేశారు బిల్కిస్‌ బానో. తాజాగా ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఇదీ కేసు..
2002లో గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే బిల్కిస్‌ బానో కుటుంబ సభ్యులను హత్య చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ స్పెషల్‌ కోర్టు 2008 జనవరిలో జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్లు జైలులో గడిపిన తర్వాత తమను విడుదల చేయాలంటూ అందులో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో 1992 నాటి రెమిషన్‌ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. అందుకు సుప్రీం కోర్టు సైతం అనుమతిచ్చింది. దీంతో వారు 2022, ఆగస్టు 15న దోషులను విడుదల చేశారు.

ఇదీ చదవండి: బిల్కిస్‌ బానో దోషుల విడుదల కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ

మరిన్ని వార్తలు