పార్లమెంట్‌లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రప్రథమం! సీఎం స్టాలిన్‌ సెటైర్లు

14 Feb, 2023 19:53 IST|Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రధాని నరేంద్ర మోదీ, తమ గవర్నర్‌ రవిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాన్ని ఏకిపారేస్తూ సాగిన ప్రధాని ప్రసంగాన్నే ప్రధానంగా చేసుకుని మోదీపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం స్టాలిన్‌.  ఇతరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే.. గంటల తరబడి మాట్లాడే కళను ప్రధాని నుంచే నేర్చుకున్నానంటూ వెటకారపు కౌంటర్‌ ఇచ్చారు సీఎం స్టాలిన్‌.

"ప్రధాని మోదీ, తనపై, బీజేపీ పార్టీపై ఆరోపణలు వస్తున్నా.. దేనికీ స్పందించరు. పైగా ప్రజల నమ్మకమే తమ రక్షణ కవచం అని కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి ప్రజలు అలా భావించడం లేదు. ప్రధాని మోదీ ప్రసంగం పూర్తిగా వాక్చాతుర్యంతో కూడుకున్నదే తప్ప అందులో పస లేదు. అసలు ఆ ప్రసంగంలో బీబీసీ డాక్యుమెంటరీ, అదానీ వ్యవహారాల గురించి ఎలాంటి వివరణ ఇవ్వకుండా.. తెలివిగా ప్రసంగించారు" అని అన్నారు స్టాలిన్.

ఒక పక్క అదానీ గ్రూపుపై ఆరోణలు, కేంద్రంలోని బీజేపీపై ప్రత్యక్ష ఆరోపణలకు సంబంధించి సుప్రీం ధర్మాసనం కూడా కేసును సీరియస్‌గా విచారిస్తోంది. కాబట్టి దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే స్టాలిన్‌ పట్టుబడుతున్నారు. అంతేగాదు ఈ విషయమై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించాలని అన్నారు. ఐతే పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలను స్పీకర్‌ తొలగించడంతో నిరసనలకు దారితీసిందన్నారు స్టాలిన్‌.

ఐతే ఈ విషయమై మోదీ ఇది సర్వసాధారణం, సమంజసం అని ఒక ప్రధాని చెప్పడం తనను షాక్‌కి గురిచేసిందన్నారు. పార్లమెంట్‌ రికార్డుల నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ ప్రసంగాలను తొలంగించినంత మాత్రన ప్రజల మనస్సులో ఉండరని అర్థం కాదన్నారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రతిపక్షాలను ఏకం చేస్తోందన్న ప్రధాని వ్యాఖ్య వింటే.. ప్రతిపక్షాలపై ప్రతీకార రాజకీయాల తెగబడుతున్నట్లు ఒప్పుకున్నట్లేగా అన్నారు. ఇలా ఒక ప్రధాని పార్లమెంటులో ఒప్పుకోవడం ఇదే తొలిసారన్నారు. 

ఇది నిజంగా దేశానికి మేలు చేయకపోగా ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదంటూ మండిపడ్డారాయన. కాగా, సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌ ప్రాజెక్టుపై డీఎంకే ప్రశ్నలకు కూడా ప్రధాని స్పందిచలేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 2007 నుంచి నిలిపేశారని, దీనిని వెంటనే పునరుద్ధరించి అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే రాష్ట్రపతి ఆమోదంతో మెడికల్‌ అడ్మిషన్‌ కోసం నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌ఈఈటీ) నుంచి మినహాయింపు కోరే బిల్లు రాష్ట్రాలకు సంబంధించిన హక్కు అన్నారు.

గవర్నర్‌ తీరే అంతనా?
రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ జోక్యం చేసుకోవడమే గాక.. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ను నిషేధించే బిల్లును సైతం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కారణంగా జరిగిన ఆత్మహత్యలు గురించి ప్రస్తావిస్తూ.. ఇలాంటి వాటి గురించి గవర్నర్‌కు ఏం చేయాలో తెలియాదా అని నిలదీశారు. అలాంటి విషయాల్లో చట్టాన్ని తీసుకురావాలని మద్రాసు హైకోర్టు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు స్టాలిన్‌. ఒక ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్‌ మూడు నెలలుగా బిల్లుకు ఆమోదం తెలపకపోవడం ఒక మిస్టరీ అని స్టాలిన్‌ అన్నారు. 

(చదవండి: రాహుల్‌ గాంధీనే స్వయంగా పర్యటన రద్దు చేసుకున్నారు)


 

మరిన్ని వార్తలు