తాండవ్‌ వివాదం: ‘ఆమె‌ అరెస్ట్‌ తప్పదు’

26 Feb, 2021 10:11 IST|Sakshi

అపర్ణ పురోహిత్‌ ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ తిరసక్కరణ

కీలక వ్యాఖ్యలు చేసిన అలహాబాద్‌ హై కోర్టు

లక్నో: అమెజాన్‌ ముఖ్య అధికారి అపర్ణ పురోహిత్‌కి అలహాబాద్‌ హై కోర్టులో చుక్కెదురయ్యింది. ‘తాండవ్’‌ వెబ్‌ సీరిస్‌ మీద నమోదైన కేసుకు సంబంధించి ఆమె దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను అలహాబాద్‌ హై కోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జ్‌ తిరస్కరించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయిన పొలిటికల్‌ డ్రామా తాండవ్‌పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాండవ్‌ మేకర్స్‌పై ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో కేసు నమోదు చేశారు. తాండవ్‌ వెబ్‌ సిరీస్‌లో మతపరమైన శత్రుత్వం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఇందుకు గాను ఈ వెబ్‌ సీరిస్‌‌ మేకర్స్‌‌పై చర్యలు తీసుకోవాలిందిగా ఫిర్యాదులో కోరారు. 

అపర్ణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ సిద్ధార్థ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పిటిషన్‌దారుకి ఈ దేశ చట్టాలపై చిన్నచూపు ఉన్నట్లు ఆమె ప్రవర్తన ద్వారా తెలుస్తోంది. ఈ కారణంగా ఆమెకు కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించదు’’ అన్నారు. ‘‘ఒకవేళ దేశ పౌరులు ఇలాంటి నేరాలకు పాల్పడితే.. ఇక్కడి జనాల నుంచి వ్యతిరేకతను, నిరసనను చవి చూడాల్సి వస్తుంది. అప్పుడు వెంటనే ఈ దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన శక్తులు చురుకుగా మారతాయి. చిన్నవిషయాన్ని పెద్దదిగా చేసి..  భారతీయ పౌరులు అసహనంగా ఉన్నారు.. 'ఇండియా' నివసించడానికి అసురక్షిత ప్రదేశంగా మారిందని ఆరోపిస్తూ వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ప్రచారం చేస్తూ.. చర్చను లేవనెత్తుతాయి. దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి’’ అన్నారు.

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ జైలులో చాలా రోజులు గడిపిన తరువాత ఇటీవల సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన హాస్యనటుడు మునవర్ ఫరూకి కేసును ప్రస్తావిస్తూ, న్యాయమూర్తి.. "పాశ్చాత్య చిత్ర నిర్మాతలు వారి దైవమైన యేసు ప్రభువును, ఇతర ప్రవక్తలను ఎగతాళి చేసే సాహసం చేయరు. కాని హిందీ చిత్ర నిర్మాతలకు ఈ విషయంలో ఎలాంటి హద్దులు లేవు. ఇప్పటికే అనేక సార్లు వారు హిందూ దేవతలను చాలా ఘోరంగా అవమానించారు’’ అని పేర్కొన్నారు.
 
ఈ మధ్య కాలంలో హిందీ చిత్ర పరిశ్రమలో చారిత్రక, పౌరాణిక వ్యక్తుల ఇమేజ్‌ను అణచివేసే చర్యలు పెరిగాయని.. దీన్ని సరైన రీతిలో అడ్డుకోకపోతే భారతీయ సామాజిక, మత పరిస్థితులు వినాశకరమైన పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని.. ఇలాంటి చర్యలు సరైనవి కావని జస్టిస్‌ సిద్ధార్థ్‌ అభిప్రాయపడ్డారు. ఈ దేశ సాంఘిక, సాంస్కృతిక వారసత్వం గురించి పెద్దగా తెలియని దేశంలోని యువ తరం ప్రస్తుతం సినిమాల్లో చూపించిన వాటిని క్రమంగా నమ్మడం ప్రారంభిస్తారని.. ఇద దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి:
'తాండవ్'‌ వివాదం.. నాలుక కోస్తే రూ. కోటి రివార్డు
అమెజాన్‌ నెత్తిన పిడుగు: సుప్రీంకోర్టు నోటీసులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు