స్కూల్‌లోనే ఆమెను ప్రేమించాను.. లవ్‌స్టోరి రివీల్‌ చేసిన డిప్యూటీ సీఎం తేజస్వీ

12 Aug, 2022 21:06 IST|Sakshi

Tejashwi Yadav's Comments On Wife Rachel Godinho.. బీహార్‌లో అనూహ్య పరిస్థితుల మధ్య నితీష్‌ కుమార్‌.. కాంగ్రెస్‌, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం, సీఎంగా నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తేజస్వీ యాదవ్‌ ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను షేర్‌ చేసుకున్నారు. ముఖ్యంగా తన భార్య.. రాచెల్‌ గొడిన్హో(రాజ్ శ్రీ)తో ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తమది లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

తన లవ్‌ ట్రాక్‌ గురించి తేజస్వీ యాదవ్‌.. తన తండ్రి లాలూ ప్రసాద్‌కు..‘ఈ(రాచెల్‌) అమ్మాయితో నేను డేటింగ్ చేస్తున్నాను. ఈమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాచెల్‌.. క్రిస్టియన్’ అని చెప్పాను. ఆ సమయంలో మా నాన్న(లాలూ ప్రసాద్‌) ఓకే, నో ప్రాబ్లమ్ అన్నట్టుగా తమ పెళ్లికి ఆమోదం తెలిపారంటూ తేజస్వీ చెప్పుకొచ్చారు. అలాగే.. తన భార్య రాచెల్‌ వివరాలు చెబుతూ.. హర్యానాలోని రేవారి జిల్లాకు చెందిన ఆమె.. తాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో క్లాస్ మేట్‌ అని.. ఇద్దరి మధ్య ఏడేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిచిందన్నారు. 

ఇక, తమ పెళ్లి తర్వాత రాచెల్‌ హిందుత్వంలోకి మారిందని.. అప్పుడే తన పేరును రాజ్ శ్రీగా మార్చుకుందని జాతీయ మీడియాలో కథనాల్లో పేర్కొన్నారు. కాగా, లాలు, రబ్రీదేవి దంపతులకు తొమ్మిది మంది సంతానం ఉన్నారు. వారిలో తేజ్‌ప్రతాప్‌, తేజస్వి యాదవ్‌ అబ్బాయిలు కాగా, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరందరిలో చిన్నవాడు తేజస్వీ యాదవ్‌. ఇక, తేజస్వీ యాదవ్‌ రాజకీయాల్లోకి రాకముందు క్రికెట్‌ ఆడిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు