-

Thane: విద్యుత్‌ బకాయిల కోసం వెళ్తే.. హింస

5 Jul, 2021 13:16 IST|Sakshi

థానే: మహారాష్ట్రలోని ఓ గ్రామంలో చేపట్టిన విద్యుత్‌ బకాయిల వసూళ్ల డ్రైవ్‌ హింసాత్మకంగా మారింది. గ్రామస్తుల మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థ గార్డు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మరమగ్గాల పరిశ్రమ కేంద్రమైన భివాండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ బిల్లుల బకాయిదార్లపై చర్యలు తీసుకునేందుకు ఓ విద్యుత్‌ సంస్థకు చెందిన సిబ్బంది తమ సెక్యూరిటీ గార్డు తుకారాం పవార్‌తో కలిసి శనివారం భివాండి సమీపంలోని కనేరి గ్రామానికి వెళ్లారు. 

విద్యుత్‌ సరఫరా లైన్లను కట్‌ చేసేందుకు ప్రయత్నించగా గ్రామంలోని 10 నుంచి 15 మంది కలిసి వారందరినీ కొట్టారు. ఈ దాడిలో గార్డు తుకారాం పవార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు నిజాంపుర స్టేషన్‌ పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక అందాక తదుపరి చర్యలుంటాయని చెప్పారు. 

ఇక విద్యుత్‌ సంస్థే తమ తండ్రి మరణానికి కారణమని తుకారాం కుమారుడు ఆరోపిస్తున్నారు. బకాయిదారులపై చర్యలు సాధారణంగా ఉండేవేనని, అందుకే పోలీసు రక్షణ కోరలేదని సదరు విద్యుత్‌ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. 

నేరస్థుడి మృతితో దాడి
మరో ఘటనలో నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లిన వాళ్లపై దాడి జరిగింది. భివాండిలోని కసాయివాడలో శుక్రవారం ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి జరిగింది. గుజరాత్‌ పోలీసులు, భివాండి క్రైం బ్రాంచి పోలీసులు సాధారణ దుస్తుల్లో వెళ్లి జమీల్‌ ఖురేషిని పట్టుకునేందుకు వెళ్లారు. వారి నుంచి తప్పించు కునే క్రమంలో ఖురేషి తను ఉన్న నాలుగో అంతస్తు ఫ్లాట్‌ కిటికీ నుంచి కిందికి దూకి, ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు పోలీసులే కారణ మంటూ స్థానికులు, మృతుడి కుటుంబీకులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు