‘థియేటర్‌ కమాండ్స్‌’ ఏర్పాటు కీలక మలుపు!

22 Oct, 2020 06:16 IST|Sakshi

సైనిక సంస్కరణలపై ఆర్మీ చీఫ్‌

న్యూఢిల్లీ: త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం ‘ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్స్‌’ను ఏర్పాటు చేయడం సైనిక సంస్కరణల్లో తదుపరి కీలక నిర్ణయం అవుతుందని బుధవారం ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే వెల్లడించారు. సైనిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ‘చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌)’ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. థియేటర్‌ కమాండ్స్‌  పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందన్నారు.

తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు ఐక్యంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనరల్‌ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని ‘కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌’లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో సాయుధ దళాల విలీనం తప్పని సరిగా చోటు చేసుకునే విషయమని, త్రివిధ దళాల మధ్య సమన్వయానికి, వనరుల అత్యుత్తమ వినియోగానికి అది తప్పదని జనరల్‌ నరవణె వ్యాఖ్యానించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు ఒక కమాండర్‌ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా, ఐకమత్యంగా ఉమ్మడి మిలటరీ లక్ష్యం కోసం సమర్ధవంతంగా, సమన్వయంతో పనిచేసేందుకు ఏర్పాటు చేసేవే ‘ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్స్‌’.

మరిన్ని వార్తలు