మధ్య తరగతికి చేరువ కండి

30 Jan, 2023 05:08 IST|Sakshi

పథకాలను ప్రచారం చేయండి

మంత్రులకు మోదీ దిశానిర్దేశం

మధ్య తరగతికి మరింత చేరువ కావాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి లబ్ధి చేకూర్చిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత వివరంగా తెలియజేయాలన్నారు. ఆదివారం ఇక్కడ మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. బుధవారం సమర్పించబోయే కేంద్ర బడ్జెట్‌ గురించి చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు పేద, అణగారిన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూర్చడంతో పాటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని ఎంతో సుఖమయం చేశాయని మోదీ అన్నారు.

ఈ విషయాలన్నింటినీ వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ బ్రిటిష్‌ వలస పాలనకు సంబంధించిన చిహ్నాలన్నింటినీ ఒక్కొక్కటిగా తప్పిస్తూ ముందుకు సాగుతున్నట్టు ప్రధాని చెప్పారు. భేటీలో మూడు అంశాలపై మంత్రులకు ప్రజెంటేషన్లు ఇచ్చారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన పనితీరుపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌ గౌబా సవివరంగా ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఆరోగ్య, విద్యా రంగాల్లో సాధించిన ప్రగతిని కూడా వివరించారు. చిన్న, మధ్య తరహా నగరాల్లోనూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ల స్థాపన తదితరాలను ఉటంకించారు. విద్యా వ్యవస్థలో అన్ని స్థాయిల్లోనూ విద్యార్థుల చేరిక, కొనసాగింపు శాతం బాగా పెరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మానవ వనరులతో పాటు అన్నిరకాల వసతులనూ మెరుగు పరిచామన్నారు. ఇక కేంద్రం ప్రారంభించిన పలు ప్రాజెక్టుల వివరాలపై పరిశ్రమలు, అంతర్గత వర్తక శాఖ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ మంత్రులకు మరో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మాధ్యమాలను మరింత మెరుగ్గా ఎలా వాడుకోవచ్చో సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తన ప్రజెంటేషన్లో వివరించారు.  

మరిన్ని వార్తలు