చర్చలు అసంపూర్ణం

4 Dec, 2020 00:57 IST|Sakshi
వెంట తెచ్చుకున్న ఆహారాన్నే తింటున్న రైతు ప్రతినిధులు

రైతులతో రేపు మరో విడత సంప్రదింపులు

వ్యవసాయ చట్టాల్లోని తమ అభ్యంతరాలను వివరించిన రైతు ప్రతినిధులు

అనుమానాలను నివృత్తి చేస్తామన్న మంత్రులు

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్‌ చేసిన టీ, లంచ్‌ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్‌ చేశారు.

కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్‌ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు.

కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు.  ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్‌డీఎం(సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది.

అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్‌ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్‌ బదులిచ్చారు. తోమర్, సోమ్‌ ప్రకాశ్‌లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు.

‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్‌సీసీ(ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్‌‡్ష కోఆర్డినేషన్‌ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్‌ సింగ్‌ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్‌’ అని ఏఐకేఎస్‌సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

మీ ఆతిథ్యం మాకొద్దు
చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్‌లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు.   


ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా