ఉమేష్‌ పాల్‌ హత్య కేసు నిందితుడు.. ఎన్‌కౌంటర్‌లో మృతి

27 Feb, 2023 18:33 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన ఉమేష్‌పాల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అర్భాజ్‌.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్‌ వద్ద ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌, జిల్లా పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్‌కు కూడా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

కాగా 2005లో హత్యకు గురైన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్య కేసులో ఉమేష్‌ పాల్‌ ప్రధాన సాక్షిగా ఉన్నారు. గత శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లోని తన నివాసం వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో అతను మరణించాడు.  తన హ్యుందాయ్‌ ఎస్‌యూవీ కారు వెనక సీట్‌ నుంచి నుంచి దిగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో గాయపడ్డ ఉమేష్‌పాల్‌ను వెంటనే స్వరూప్‌ రాణి ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భర్త హత్యపై ఉమేష్‌పాల్‌ భార్య ప్రయాగ్‌రాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌, అతని సోదరుడు, భార్య షైస్తా పర్వీన్, కుమారులు అహ్జాన్‌, అబాన్‌తో సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విధంగా బీజేపీ నేత రహిల్‌ హసన్‌ సోదరుడు గులాం పేరును కూడా ఈ హత్య కేసులో చేర్చారు. దీంతో అతన్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఉమేష్‌పాల్‌ కేసులో ఇప్పటి వరకుఅతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ కూడా ఈ కేసులో కుట్ర పన్నినట్ల యూపీ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని కూడా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.

కాగా రాజు పాల్‌ అలహాబాద్‌ పశ్చిమ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొన్ని నెలలకే హత్యకు గురయ్యాడు. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌ తమ్ముడు ఖలీద్‌ అజీమ్‌ను ఓడించడం వల్లనే హత్యకు గురైనట్లు ఆరోపణలున్నాయి.మరోవైపు ఉమేష్ పాల్ హత్య కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ అతిక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమీషనర్ రమేష్ శర్మ, ఏడీజీ ఎస్టీఎఫ్‌ అమితాబ్ యాష్ కలిసి ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని విమర్శించింది. తన భర్త అతిక్ అహ్మద్, తమ్ముడు అష్రఫ్‌లను హత్య చేయడానికి కాంట్రాక్టులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

మరిన్ని వార్తలు