వరుస నష్టాలు, గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో అదానీ ఎక్కడంటే?

27 Feb, 2023 18:52 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఏడో సెషన్‌లో కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా  ఫెడ్‌ రేట్ల పెంపుపై ఆందోళనల మధ్య గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్‌తో గత ఐదు నెలల్లో లేని నష్టాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో  విదేశీ నిధుల ప్రవాహం, ఐటీ, ఆటో, ఆయిల్ స్టాక్స్‌లో నష్టాలు కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీశాయి.

చివరికి సెన్సెక్స్ 176 పాయింట్లు లేదా 0.30 శాతం క్షీణించి 59,288 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో  526 పాయింట్ల మేర కుప్పకూలింది. నిఫ్టీ 73   పాయింట్ల నష్టంతో 17,393 వద్ద ముగిసింది.  కాగా ఏడు సెషన్లలో, సెన్సెక్స్ 2,031 పాయింట్లు లేదా 3.4 శాతం క్షీణించగా, నిఫ్టీ 643 పాయింట్లు లేదా 4.1 శాతం నష్టపోయి 17,400 స్థాయికి దిగువన ముగిసింది. అటు డాలరుమారకంలో రూపాయి 9పైసల నష్టంతో 82.84 వద్ద ముగిసింది. 

టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, లార్సెన్ & టూబ్రో, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్  భారీగా నష్టపోగా,  పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి.

40 బిలియన్‌ డాలర్ల దిగువకు అదానీ మార్కెట్‌ క్యాప్‌
మరోవైపు  అమెరికా షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ  హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తరువాత  బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని  అదానీ గ్రూపు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్  40 బిలియన్ల డాలర్ల మార్క్ దిగువకు పడిపోయింది. ప్రధానంగా ఫిబ్రవరి 27న అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు  12 శాతం క్షీణించి 1107 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో పుంజుకుని 1188 వద్ద ముగిసింది.  దీంతో గ్రూప్ వాల్యుయేషన్ ఆగస్టు 2021 తర్వాత మొదటిసారిగా రూ. 7 లక్షల కోట్ల దిగువకు పడిపోయిందని మార్కెట్‌ వర్గాల అంచనా. జనవరి 24 నాటికి  రూ. 19.19 లక్షల కోట్లతో పోలిస్తే 65 శాతం  క్షీణించింది.  దీంతో  గౌతం అదానీ ఇప్పుడు గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో 39వ స్థానానికి పడిపోయారు.

మరిన్ని వార్తలు