ఎద్దు అంతిమ సంస్కారం.. 3 వేల మంది హాజరు

23 Aug, 2021 11:57 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటన

ఎద్దు కర్మకాండకు భారీగా హాజరైన జనాలు

లక్నో: మరణించిన ‘బాబూజీ’ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పూజారి మంత్రాలు పఠిస్తున్నాడు. అక్కడ గుమికూడిన ప్రజలు పూజారి ఆజ్ఞల ప్రకారం చేస్తున్నారు. దాదాపు 3 వేల మంది జనాలు బాబూజీ అంతిమ సంస్కారాలకు హాజరు అయ్యారు. ఇంత మంది అభిమానాన్ని చూరగొన్న బాబూజీ ఎంత అదృష్టవంతుడో కదా అనుకుంటున్నారా.. అయితే అక్కడే ఉంది ట్విస్ట్‌. ఇంత భారీ ఎత్తున జనాలు హాజరయ్యింది మనిషి కర్మకాండ కార్యక్రమానికి కాదు.. ఎద్దుది. వినడానికి కాస్త వింతగా ఉన్న ఇది వాస్తవం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌పూర్‌ కుర్ది గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 

గ్రామస్తులు ముద్దుగా ‘బాబూజీ’ అని పిలుచుకునే ఎద్దు గత 20 ఏళ్లుగా కుర్ది గ్రామంలో ఉంటుంది. గ్రామస్తులు ఆ ఎద్దును భగవంతుడి బహుమతిగా భావించేవారు. ఇక బాబూజీ కూడా సాధు స్వభావం కల్గి ఉండి.. ఎవరికి ఏ హానీ చేసేది కాదు. పిల్లలైతే బాబూజీ దగ్గరకు వెళ్లి ఎలాంటి భయం లేకుండా దానితో ఆడుకునేవారు. అలా 20 ఏళ్లుగా గ్రామస్తుల కుటుంబంలో భాగస్వామిగా ఉన్న బాబూజీ ఈ నెల 15న మృతి చెందింది.(చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్‌ డ్రైవర్‌ ఆవేదన)

బాబూజీ మరణం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. చాలా మంది తమ ఇంట్లోనే వ్యక్తి మరణించినట్లే భావించారు. ఇక బాబూజీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు.. ఇంటికింత అని చందా వేసుకుని డబ్బు పోగు చేశారు. అలా జమ అయిన డబ్బుతో ఘనంగా బాబూజీ అంత్యక్రియలు నిర్వహించడమే కాక.. అంతిమసంస్కార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. (చదవండి: కట్నంకోసం, నడివీధిలో అమానుషం: షాకింగ్‌)

ఈ క్రమంలో ఆదివారం బాబూజీకి కర్మకాండ కార్యక్రమం నిర్వహించగా.. దీనికి ఏకంగా 3 వేల మంది హాజరయ్యారు. బాబూజీ మృతికి సంతాంప తెలిపారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘చాలా ఏళ్ల క్రితం బాబూజీ మా గ్రామానికి వచ్చింది. మా ఊరిలో పవిత్ర ప్రదేశంగా భావించే స్థలంలో బాబూజీ కనిపించడంతో.. దాన్ని దేవుడి బహుమతిగా భావించాం. చాలా మంది దాన్ని నందిగా భావించేవారు. ఇక బాబూజీ గ్రామంలో తిరుగుతున్నంకాలం మా జీవితాలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు అనిపించేది. బాబూజీ మృతి మమ్మల్ని ఎంతో బాధిస్తుంది. మా కుటుంబ సభ్యుడే మరణించినంత బాధగా ఉంది’’ అని తెలిపాడు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు యువకులు బాబూజీ కటౌట్‌ ఏర్పాటు చేసి.. దాని మెడలో పూల దండలు, కరెన్సీ నోట్ల దండలు వేశారు. 

మరిన్ని వార్తలు