ఉత్తరాఖండ్‌ విలయం: 136 మంది మరణించినట్టే..

23 Feb, 2021 19:18 IST|Sakshi

మరణ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేస్తున్న ఉత్తరాఖండ్‌

ఘటన జరిగి రెండు వారాలు

ఆచూకీ లభించని అదృశ్యమైన వారు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 7వ తేదీన సంభవించిన ఘోర విపత్తులో అదృశ్యమైన 136 మంది ఆచూకీ కనుగొనడానికి కష్టసాధ్యమైంది. వారి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో.. ఘటన జరిగి రెండు వారాలు దాటడంతో ఇక అదృశ్యమైన వారంతా మృతి చెందినట్టేనని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అదే విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు విన్నవించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వారి మరణ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేస్తోంది.

నందాదేవి పర్వత శ్రేణుల్లో కొండచరియలు విరిగిపడడంతో చమోలీ ప్రాంతంలో ఒక్కసారిగా దౌలీగంగా నది ప్రవాహం పెరిగింది. సునామీ మాదిరి నది ప్రవాహం దూసుకురావడంతో అక్కడి స్థానికులతో పాటు పర్యాటకులు కొట్టుకుపోయారు. ఆ నది ప్రవాహం కొండకోనలు దాటుకుంటూ వెళ్లడంతో ఆ ప్రవాహంలో వెళ్లిన వారంతా చెల్లాచెదురయ్యారు. అలా వెళ్లిన వారిని గుర్తించేందుకు భద్రత బలగాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించగా తక్కువ సంఖ్యలో బాధితులను కనుగొన్నారు.

మొత్తం 204 మంది అదృశ్యమవగా వారిలో 69మంది మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మిగతా 136 మంది ఆచూకీ లభించలేదు. తీవ్రంగా శ్రమించినా వారి ఆచూకీ లభించకపోవడం..ఘటన జరిగి రెండు వారాలు దాటడంతో ఇక వారంతా మృతిచెంది ఉంటారని అధికారులు ఓ అభిప్రాయానికి వచ్చారు. దీంతో అదృశ్యమైన వారిని మూడు కేటగిరిలుగా ఉత్తరాఖండ్‌ ఆరోగ్య శాఖ విభజిస్తోంది. స్థానికం, రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అదృశ్యమైనవారంతా మృతిచెందినట్టు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు