బిర్యానీ బిల్లు రూ.3 లక్షలు..! అవాక్కైన అధికారులు

16 May, 2022 13:56 IST|Sakshi

కోల్‌క‌తా : బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఎక్కువగా ఆర్డర్‌ ఇచ్చేది బిర్యానీనే. ఇంట్లోనూ బిర్యానీ ఎంతో ఇష్టంగా చేసుకొని తింటారు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, మష్రూమ్‌ బిర్యానీ.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. సాధారణంగా బయట హోటల్స్‌లో సింగిల్ బిర్యానీ రూ. 100 నుంచి 200 ఉండొచ్చు. అదే ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వ‌ర‌కు ఉంటుంది.. కానీ కొందరు బిర్యానీ కోసం రూ. 3 ల‌క్ష‌లు ఖర్చు చేశారట. ఆ బిల్లును ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి స‌మ‌ర్పించ‌డంతో.. ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది.  బిర్యానీ కోసం లక్షల్లో బిల్లు పెట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. 

పశ్చిమ బెంగాల్‌లోని కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో ఈ  వింత ఘటన జరిగింది. శోబిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవలే ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలనుకున్నారు. కింగ్ షుక్ గోష్ అనే కాంట్రాక్ట‌ర్ ఫ‌ర్నీచ‌ర్, వాహ‌నాల‌తో పాటు బిర్యానీని స‌ర‌ఫ‌రా చేస్తుంటాడు. వీటన్నింటి ఖర్చులు కలపి సుమారు రూ. కోటి బిల్లు పెట్టాడు. అయితే అందులో బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు, ఫర్నీచర్‌ కోసం 82 వేలు వెచ్చించినట్టు బిల్లు దాఖలు చేశాడు. 

వీటిని చూసి సూపరింటెండెంట్‌ షాక్‌ అయ్యారు. బిల్లులు అన్ని పరిశీలించి కాంట్రాక్ట‌ర్ స‌మ‌ర్పించిన వాటిలో 81 బిల్లులు బోగ‌స్‌వే ఉన్నట్లు  గుర్తించారు. దీంతో పెద్దఎత్తున అవినీతి జరిగినట్టు గుర్తించిన అధికారి.. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు.
చదవండి: ‘ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు..ఇంట్లో పొయ్యి వెలిగించే సిద్ధాంతం’

మరిన్ని వార్తలు