వైరల్‌: 17 నిమిషాల్లో పెళ్లి.. కట్నంగా ఏం కోరాడంటే

17 May, 2021 15:30 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న అనూహ్య పెళ్లి సంఘటన

లక్నో: మన సమాజంలో వివాహ వేడుకను ఎంత ఘనంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా తమ తమ స్థోమతలకు తగ్గట్టుగా పెళ్లి వేడుక నిర్వహిస్తారు. ఇక ముఖ్యంగా పెళ్లి తంతు ఎంత లేదన్న కనీసం గంటకు పైగానే సాగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్‌ షాజహన్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుక గురించి చదివితే తప్పకుండా ఆశ్చర్యపోతారు. 

కేవలం 17 నిమిషాల్లో పెళ్లి తంతు ముగిస్తే.. ఇక కట్నంగా ఆ వరుడు ఏం కోరాడో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ పెళ్లి కుమారుడు రామాయణ గ్రంథాన్ని ఇవ్వమని కోరాడు. అది కూడా తన బావ మరుదులకు ఇష్టమైతేనే. ఈ పెళ్లి వేడుక గురించి తెలిసిన వారంతా ఈ కాలంలో కూడా ఇంత మంచి వారు ఉంటారా అని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. 

షాజహన్‌పూర్‌కు చెందిన పుష్పేంద్ర దూబేకు స్థానికంగా ఉన్న ప్రీతి తివారితో వివాహం నిశ్చమయ్యింది. అసలే కోవిడ్‌ కాలం. ఎక్కువ మంది బంధువులను పిలవడానికి వీల్లేదు. ఇక పుష్పేంద్రకు కూడా ఇలాంటి హంగు ఆర్భాటాల మీద ఆసక్తి లేదు. ఊరేగింపు, కారు లాంటి అట్టహసాలు లేకుండా పెళ్లి కుమార్తె, మరి కొందరు అతిథులను తీసుకుని పట్నా దేవి కాళి ఆలయానికి వెళ్లాడు. అది కూడా నడుచుకుంటూ. ఆ తర్వాత ఆలయం చుట్టూ 7 సార్లు ప్రదిక్షణ చేసి వధువు మెడలో తాళి కట్టాడు. పెళ్లి ఇంత సింపుల్‌గా చేసుకున్న ఆ వ్యక్తి... ఇక కట్నంగా రామాయణం గ్రంథాన్ని ఇవ్వమన్నాడు. అది కూడా బావమరుదులుకు అంగీకరమైతేనే. 

ఈ సందర్భంగా నూతన దంపతులు పుష్పేంద్ర-ప్రీతి మాట్లాడుతూ.. ‘‘వరకట్నం అనే మహమ్మారి వల్ల ఎందరో మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే మేం కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని చూసి మరికొందరైనా మారితే ఎంతో సంతోషిస్తాం’’ అన్నారు. ఈ దంపతులు చేసిన పనిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. 

చదవండి: విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు   

మరిన్ని వార్తలు