వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ ఇప్పుడే కాదు

8 May, 2021 03:54 IST|Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌పై వాట్సాప్‌ యాజమాన్యం వెనక్కి తగ్గింది. మే 15వ తేదీలోగా ఖాతాదారులు దీన్ని ఆమోదించాలని, లేకపోతే ఖాతాలను రద్దు చేస్తామంటూ విధించిన డెడ్‌లైన్‌ను ఉపసంహరించుకుంది. ప్రైవసీ పాలసీ ఆప్‌డేట్‌ చేసుకోకపోయినా మే 15న ఖాతాలేవీ రద్దు కావని వాట్సాప్‌ అధికార ప్రతినిధి శుక్రవారం స్పష్టం చేశారు. భారత్‌లో వాట్సాప్‌ ఖాతాలన్నీ యథాతథంగా పని చేస్తాయని పేర్కొన్నారు. ప్రైవసీ విధానంపై తదుపరి నిర్ణయాలను వినియోగదారులకు తెలియజేస్తామన్నారు. ఈ విధానంపై కొత్త నియమ నిబంధనలను మెజార్టీ వినియోగదారులు ఆమోదించారని గుర్తుచేశారు.

కొందరికి మాత్రం ఇంకా ఆ అవకాశం రాలేదన్నారు. అయితే, డెడ్‌లైన్‌పై వెనక్కి తగ్గడానికి గల కారణాలను వాట్సాప్‌ యాజమాన్యం బయటపెట్టలేదు. కొత్త నిబంధనలను ఎంతమంది వినియోగదారులు ఆమోదించారో చెప్పలేదు. ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్‌ యాజమాన్యం ఈ ఏడాది జనవరిలో కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఫిబ్రవరి 8లోగా వీటిని ఆమోదించాలని గడువు విధించింది. అనంతరం ఈ డెడ్‌లైన్‌ను మే 15 దాకా పొడిగించింది. కొత్త పాలసీలో భాగంగా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ యాజమాన్యం పంచుకుంటోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే, దీన్ని వాట్సాప్‌ కొట్టిపారేసింది.   

మరిన్ని వార్తలు