ట్రాఫిక్‌ పోలీసులపై రెచ్చిపోయిన యువతి.. చేయి నరికేస్తా అంటూ బెదిరింపులు

25 Sep, 2023 11:44 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపై డ్రైవ్‌ చేయడమే కాకుండా.. బైక్‌ ఆపిన పోలీసులపై రెచ్చిపోయి ప్రవర్తించింది. ట్రాఫిక్‌ పోలీసులపై దుర్భషలాడుతూ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. ఈ ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌ వద్ద జరిగింది. 

వివరాలు.. నూపుర్‌ ముఖేష్‌ పటేల్‌ అనే 26 ఏళ్ల ఆర్కిటెక్ట్‌ దక్షణి ముంబై వైపు అతివేగంతో వెళుతోంది. గుర్తించిన బాంద్రా-వర్లీ సీ లింక్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే మహిళ తన బైక్‌ను దిగడానికి నిరాకరించింది. దీంతో పోలీసులుర ఆమెను కిందకు దింపేందుకు ప్రయత్నించగా వారితో వాదించడం ప్రారంభించింది.

‘ఈ రోడ్డు నా తండ్రిది. నేను ట్యాక్స్‌ కడుతున్నాను. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ పోలీసులను బెదిరించింది. బైకర్‌ను ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోకుండా బైక్‌ను నడిరోడ్డుపై నిలిపి ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగింది. ‘నా బైక్‌పై చేయి పెట్టడానికి ఎంత ధైర్యం.. నీ చేయి నరికేస్తాను’ అంటూ రెచ్చిపోయింది.  అంతేగాక ఓ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. 

కాగా ట్రాఫిక్‌ పోలీసులతో మహిళ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో ఆమె ప్రవర్తించిన విధానాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. యువతిని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఆమెగా గుర్తించారు. బుల్లెట్‌ బైక్‌ అక్కడి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో రిజిస్టర్‌ అయి ఉన్నట్లు తేలింది.

మరోవైపు యువతిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక విచారణకు హాజరు కావాల్సిందిగా సెక్షన్ 41A కింద ఆమెకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు