రోడ్డుపై కుప్పకూలిన మహిళ.. జేసీబీలో వేసుకుని.. 

3 May, 2021 14:06 IST|Sakshi

బెంగళూరు : కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా మానవత్వం మంటగలుస్తోంది. ఆపద కాలంలో మనిషికి తోడు నిలవాల్సిన తోటి మనిషి చావు భయంతో వెనకడుగు వేస్తున్నాడు. నిత్యం వందల సంఖ్యలో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని కోలార్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం కోలార్‌కు చెందిన ఓ మహిళ తన చిన్న కూతుర్ని వెంట బెట్టుకుని ఆసుపత్రికి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత తీవ్ర అనారోగ్యం కారణంగా రోడ్డుపై కుప్పకూలి, ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. కరోనా భయంతో రోడ్డుపై వెళుతున్న వారెవరూ ఆమెకు సహాయం చేయటానికి ముందుకు రాలేదు. కనీసం అంబులెన్స్‌కు అయినా ఫోన్‌ చేద్దామన్న ఇంగితాన్ని మరిచారు. కొద్దిసేపటి తర్వాత కొందరు స్థానికులు ఆమెను జేసీబీతో ఆసుపత్రికి తరలించటానికి నిర్ణయించారు.

జేసీబీ ముందు భాగంలో ఆమెను పడేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సదరు మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. కాగా, కర్ణాటకలో కోవిడ్‌ కేసుల సంఖ్య 16 లక్షల మార్కును దాటింది. తాజాగా 37,733 కరోనా కేసులు నమోదయ్యాయి. 217 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 16, 011కు చేరింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,01, 865 కాగా, 4,21,436 యాక్టిక్‌ కేసులు ఉన్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు