ఢిల్లీ సరిహద్దుల్లో నినదించిన మహిళా రైతులు

9 Mar, 2021 06:28 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు సోమవారం మహిళా రైతుల నిరసనలతో మారుమోగాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలను వాపసు తీసుకోవాలంటూ సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లలో రైతులు మూడు నెలలకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ సమస్యలతోపాటు మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు చర్చించారు. ఇతర సంఘాలకు చెందిన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ అనుభవాలను వారు పంచుకున్నారు. పసుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించిన మహిళలు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కొందరు భాంగ్రా నృత్యాలు చేశారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. రైతు నిరసనల్లో పాల్గొనే మహిళల సంఖ్య కూడా పెరుగుతోందని వారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు, కార్లు, టెంపోలు, జీపుల ద్వారా వారు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్నారని చెప్పారు.

>
మరిన్ని వార్తలు