జొమాటో వివాదం: నేనెక్కడికీ పారిపోలేదు..

19 Mar, 2021 11:45 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: నెట్టింట అగ్గి రాజుకుంటున్న జొమాటో వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు! తప్పు నాది కంటే నాది కాదని అటు జొమాటో బాయ్ కామరాజ్‌‌, ఇటు ఆర్డర్‌ అందుకున్న యువతి హితేషా చంద్రాణి ఇరువురు ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో నెటిజన్లు కూడా రెండుగా చీలిపోయి ఇద్దరికీ మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తన మీద వస్తున్న వ్యతిరేకతపై కలత చెందిన హితేషా చంద్రాణి గురువారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ లేఖను షేర్‌ చేసింది.

"డెలివరీ బాయ్‌ నా మీద దాడి చేశాడన్న విషయాన్ని చెప్పినప్పటి నుంచి సెలబ్రిటీలతో సహా చాలామంది నన్ను మాటలతో చంపుతున్నారు. కొందరైతే చంపుతామంటూ తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాకు, నా కుటుంబానికి హాని తలపెడతామని హెచ్చరిస్తున్నారు. నా జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫోన్లు, మెసేజ్‌లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌.. ఇలా అన్ని వేదికలను ఆసరాగా చేసుకుని నాపై వేధింపులకు దిగుతున్నారు. నాకు సపోర్ట్‌ చేయండని చాటింపు చేసేందుకు నాకేం పీఆర్‌ టీం లేదు. ప్రస్తుతం నా ముక్కుకు అయిన గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. 

అయితే కొందరు తప్పు నాదే అన్నట్లుగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. అందులో వాస్తవమెంత? అని ఆలోచించకుండానే కొందరు సెలబ్రిటీలు నాదే తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ గొడవకు నేనే కారణమని చెప్తున్నారు. సెలబ్రిటీల నోటి నుంచి వచ్చే మాటలు జనాలను ప్రభావితం చేస్తాయి. అలాంటిది వారే ఇలా మాట్లాడటం నాకు బాధ కలిగించింది. మరికొందరు డెలివరీ బాయ్‌పై నేను చేసిన కంప్లైంట్‌ను వెనక్కు తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా అందరికీ చెప్పొచ్చేదేంటంటే నేను ఎక్కడికీ పారిపోలేదు. బెంగళూరులోనే ఉన్నాను. పోలీసులకు సహకరిస్తున్నాను.

కొన్ని రోజులుగా నా జీవితం నేను బతకడమే కష్టమైపోయింది. నాకు కనీస రక్షణ కరువైంది. ఏదేమైనా దర్యాప్తులో అసలు నిజం బయటపడుతుందని ఆశిస్తున్నా. ఆ క్షణం కోసం ఎదురు చూస్తుంటా. అప్పటి వరకు నా జీవితానికి, గౌరవమర్యాదలకు, ప్రశాంతతకు భంగం కలిగించకండి. అసలు నిజం బయటకొచ్చేవరకు దయచేసి ఎవరూ ఈ వివాదం గురించి స్పందించకండి" అని నెటిన్లను అభ్యర్థించింది. కాగా ఈ వివాదంపై బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా స్పందిస్తూ డెలివరీ బాయ్‌ అమాయకుడంటూ అతడికే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. యువతిది తప్పని తేలితే ఆమెను తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

చదవకండి: జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అరెస్ట్‌

జొమాటో వివాదం : ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్

మరిన్ని వార్తలు