పాములుంటాయ్‌..! జాగ్రత్త..!!

11 Sep, 2023 09:38 IST|Sakshi

జిల్లాలో జనావాసాల్లోకి సర్పాలు

ఏటా సంభవిస్తున్న మరణాలు

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

పాము కాటేస్తే కంగారుపడొద్దు

నాటువైద్యుడి వద్దకు అసలే వద్దు

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సరైన వైద్యం

నిర్మల్‌: జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో పాముకాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పొలాల్లో పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరా ల్లో ఆడుకుంటూ మరికొందరు, రాత్రిళ్లు ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాము కాటుతో మృతి చెందిన ఘటనలున్నాయి. పాముకాటు వేసిన సమయంలో బాధితులు కంగారులో నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు.

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా మూఢవిశ్వాసాలతో మంత్రాలు చేయించడం, పసరు మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రు. జిల్లాలో ప్రస్తుతమున్న చల్లని వాతావరణానికి పచ్చని చెట్లు, పొదలు తోడు కావడం, వర్షానికి వరదనీటి ప్రవాహం వస్తుండడంతో పాములు ఆరుబయట విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కాలనీల్లో జనావాసాల మధ్య, నిల్వ నీరున్న కుంటల్లో దర్శనమిస్తున్నాయి.

కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలో ఉండే గుంతలు, చెట్లపొదల వద్ద ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అటుగా వెళ్లి ఆడుకుంటున్న చిన్నపిల్లలు పాముకాటుకు గురవుతున్నారు. అంతే కాకుండా ఇళ్ల ముందు, ఆరుబయట నిలిపి ఉంచుతున్న ద్విచక్ర వాహనాలు, కారు ఇంజిన్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తుండడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

పాము కాటును ఇలా గుర్తించాలి..
పాము కరిస్తే ముందుగా ఏ ప్రాంతంలో కాటు వేసింది.. నేరుగా శరీరంపై కాటు వేసిందా? లేక దుస్తుల పైనుంచి వేసిందా? అనేది పరిశీలించాలి. శరీరంపై కాటు వేస్తే ఎన్నిగాట్లు పడ్డాయో చూడాలి. త్రాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి.

అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విష సర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లు ఉంటుంది. కరిచిన చోట రెండు రక్తపు చుక్కలు కనిపిస్తాయి.

ఇవీ.. జాగ్రత్తలు
పొలం పనులకు వెళ్లే రైతులు, అడవుల్లో పశువుల వెంట తిరిగేవారు పాముకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చిలైట్‌ వెంట తీసుకెళ్లాలి. పాములు ఎక్కువగా మోకాలు కింది భాగంలో కాటువేస్తాయి. కాబట్టి కాళ్లను కప్పి ఉండే చెప్పులు ధరించాలి. కాళ్ల కిందకు ఉండే దుస్తులు వేసుకోవాలి.

కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలి. ఎవరైనా పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

ప్రథమ చికిత్స ఇలా..
పాముకాటు వేసినప్పుడు నోరు లేదా బ్లేడ్‌తో గాటు పెట్టకూడదు. కంగారులో నాటువైద్యులను ఆశ్రయించవద్దు. పాము కాటు వేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం ఏమీ లేదని చెప్పాలి. కాటు వేసిన భాగంలోని మూడు అంగుళాల పైభాగాన గుడ్డతో కట్టాలి.

మందులు అందుబాటులో ఉంచాం
అన్ని ప్రభుత్వ దవా ఖానలు, పీహెచ్‌సీల్లో పాముకాటుకు సంబంధించిన యాంటీ స్నేక్‌ వీనం మందులు అందుబాటులో ఉంచాం. పాము కాటేస్తే దాని లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఏటా పాముకాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వానాకాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.  – ధన్‌రాజ్‌, జిల్లా వైద్యాధికారి

మరిన్ని వార్తలు