వీడియో: తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై అధికారి వెకిలి కామెంట్లు, ఆలస్యంగా బయటకు..

13 Sep, 2023 16:30 IST|Sakshi

సియాటెల్‌: అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనపై వెటకారం, వెకిలి వ్యాఖ్యలు చేసిన పోలీస్‌ అధికారి తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఘటనపై పైఅధికారి సమాచారం కోరితే.. ఆమె ప్రాణాలకు విలువే లేదన్నట్లు నవ్వుతూ మాట్లాడాడు సదరు అధికారి. ఆ క్లిప్‌ను సియాటెల్‌ పోలీసులే విడుదల చేయగా.. అది వైరల్‌ కావడంతో అధికారి చర్యలు తీసుకోవాలని అక్కడి భారతీయులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో రోడ్డు దాటుతున్న ఆమెను..  ఓ పోలీసు వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి మృతి చెందింది. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. అయితే.. ఈ ఘటన గురించి సమాచారం అందించిన తరుణంలో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతూ.. భారతీయులకు ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. 

జాహ్నవి యాక్సిడెంట్‌పై సమాచారం అందుకున్న..  సియాటెల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ గిల్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేనియల్‌ ఆర్డరర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గిల్డ్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ.. ఆర్డరర్‌ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. కేవలం చెక్‌ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. అయితే.. సోలన్‌ ఆ కాల్‌కు ఎలాంటి సమాధానం ఇచ్చారన్నది మాత్రం తెలియరాలేదు. 

సోమవారం అధికారులు ఈ వీడియో రిలీజ్‌ చేసి.. విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీళ్ల మాటలు వింటుంటే గుండె పగిలిపోతోందంటూ పోస్ట్ చేసింది. సియాటెల్ ప్రజలకు మరింత భద్రత కల్పించాల్సి ఉందని, ఇలాంటి వాటిని సహించేదే లేదని తేల్చి చెప్పింది. కేవలం తాము కచ్చితంగా విచారణ చేపడుతున్నామని ప్రజలకు తెలియజేసేందుకే ఈ వీడియో విడుదల చేసినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోందని, అప్పటి వరకూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపింది. 

అయితే తాను అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. ప్రభుత్వ లాయర్లను ఉద్దేశించి చేశానని.. ఇలాంటి కేసులోలో బాధితులకు అందాల్సిన పరిహారం ఎలా కుదించేలా ప్రయత్నిస్తారో చెప్పే క్రమంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలుస్తోంది.  

ఈ వీడియోపై జాహ్నావి దగ్గరి బంధువు అశోక్‌(హౌస్టన్‌) స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ల కూతుళ్లు, మనవరాళ్ల జీవితాలకు మాత్రమే విలువ ఉంటుందా? ప్రాణం ఏదైనా ప్రాణమే కదా అని అసహనం వ్యక్తం చేశారాయన. 

జాహ్నవి ఈ డిసెంబర్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ తీసుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. ఇదిలా ఉంటే జాహ్నవి ఘటనపై కింగ్‌ కౌంటీ అటార్నీ కార్యాలయం దర్యాప్తు జరుపుతోంది. 

మరిన్ని వార్తలు