కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై సీనియర్లు లేఖ

23 Aug, 2020 10:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గ‌త‌మెంతో ఘ‌నంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర మ‌నక‌బారుతోంది. అధ్య‌క్షుడిని కూడా ఎన్నుకోలేని స్థితిలో చుక్కాని లేని నావ‌లా త‌యారైంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రాజ‌యానికి బాధ్య‌త వ‌హిస్తూ రాహుల్ గాంధీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఇది జ‌రిగి నెల‌లు కావ‌స్తున్నా ఇంకా కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకోనేలేదు. ఈ అంత‌ర్గ‌త సంక్షోభానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ నేత‌లు రెడీ అయ్యారు. అధినాయ‌క‌త్వంతోపాటు, అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌పైనా చ‌ర్చించాల్సిందిగా 20 మంది కాంగ్రెస్ నేత‌లు ఆ పార్టీ‌ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీనిపై కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ సోమ‌వారం ఆన్‌లైన్ స‌‌మావేశం నిర్వ‌హించ‌నుంది. (త్వరలో నూతన అధ్యక్షుడి ఎన్నిక)

కాగా వ‌రుస‌గా రెండో సారి సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓటమిపాల‌వ‌డంతో రాహుల్‌ గాంధీ అధ్యక్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. పార్టీ చీఫ్‌గా కొనసాగాలని కాంగ్రెస్‌ శ్రేణులు కోరినా ఆయ‌న‌‌ దిగిరాకపోవడంతో సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్ట్‌ 9న తాత్కాలిక చీఫ్‌ బాధ్యతలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కట్టబెట్టింది. ఆ త‌ర్వాత మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అనంతరం కోవిడ్‌-19 వ్యాప్తితో నూతన అధ్యక్షుడి ఎన్నికలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మ‌రోవైపు త‌న ఆరోగ్యం దృష్ట్యా అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగేందుకు సోనియా గాంధీ విముఖ చూపిస్తున్నారు. దీంతో దారి త‌ప్పిన కాంగ్రెస్‌ను తిరిగి ప‌ట్టాలెక్కించేందుకు మ‌ళ్లీ రాహుల్‌నే నియ‌మిస్తారా?  లేదా అన్న‌ అంశం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది. (ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్‌)

మరిన్ని వార్తలు