దళితుల సంక్షేమం, సాధికారతపై చర్చకు సిద్ధమా?

15 Jun, 2023 11:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి, రాజకీయ సాధికారతకు నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏం చేస్తున్నదో.., అంతకుముందు  చంద్రబాబు సర్కార్‌ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని టీడీపీ నేతలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వేదిక, సమయం మీరే చెప్పండి. మీ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి వైఎస్సార్‌సీపీలో ఉన్న ప్రతి ఒక్క మాదిగ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు’ అని తేల్చిచెప్పారు.

దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారంతా క్షమాపణలు చెప్పి చర్చకు రావాలని సూచించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను అవహేళన చేసిన చంద్రబాబుకు డప్పు కొట్టడానికి సిగ్గులేదా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. దళిత మహిళను బూటుకాలితో తొక్కిన అచ్చెన్నాయుడిని చెప్పుతో కొట్టి మాట్లాడాలని హితవు పలి కారు. దళితులను చంద్రబాబు అడగడుగునా అవమానిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ అక్కున చేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రి  సురేష్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే
అసలు దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే. ఇప్పటికిప్పుడు కులాల సమావేశాలను చంద్రబాబు నిర్వహించడానికి ప్రధాన కారణం ఎన్నికలే. వాడుకొని వదిలేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దళిత ద్రోహులంతా నేడు సీఎం వైఎస్‌ జగన్‌పై బురదజల్లే 
ప్రయత్నం చేస్తున్నారు.  

చదవండి: Instagram Reels: రీల్స్‌ మోజులో బావిపైకి ఎక్కి...

వైఎస్‌ జగన్‌ వచ్చాకే డప్పు కళాకారులు, చర్మకారులకు న్యాయం
2019 జనవరి.. అంటే.. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నెలకు రూ.1500 చొప్పున డప్పు కళాకారులకు పింఛన్‌ ఇచ్చారు. అది కూడా 6,600 మందికి మాత్రమే మూడు నెలలే ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను సీఎం జగన్‌ రూ.3000కు పెంచారు. 2019–20లో 31 వేల మంది ,2020–21లో 43 వేల మందికి, 2021–22లో 49 వేల మంది, 2022–23లో 56 వేల మందికి పింఛన్‌ అందిస్తున్నాం. టీడీపీ హయాంలో మూడు నెలల్లో కేవలం రూ.30 కోట్లు ఇస్తే.. మేం ఏటా దాదాపు రూ.150 కోట్లు డప్పు కళాకారులకు పింఛన్‌గా ఇస్తున్నాం.

చర్మకారులకు పింఛన్‌ను చంద్రబాబు 2018 నవంబర్‌లో ప్రవేశపెట్టారు. రూ. 1000 చొప్పున 6 వేల మందికి ఇవ్వాలని జీవో నెంబర్‌ 191 ఇచ్చారు. ఇది కూడా ఎన్నికలకు మూడు నెలలు ముందు అమలు చేసి మూన్నాళ్ల ముచ్చట చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్మకారుల పింఛన్‌ రూ. 2 వేలు చేశాం. 2019–20లో 21 వేల మందికి, 2020–21లో 31,280 మందికి, 2021–22లో 35 వేల మందికి, 2022–23లో 40 వేల మందికి, 2023–24లో 41 వేల మందికి ఇస్తున్నాం. ప్రస్తుతం చర్మకారులు రూ. 2,750 పింఛన్‌ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా రూ.3 వేలు అవుతుంది. ఇప్పటి వరకు డప్పు కళాకారులకు రూ.600 కోట్లు, చర్మకారులకు రూ. 350 కోట్లు పింఛన్‌ కోసం ఇచ్చాం. అంటే.. టీడీపీ ఇచ్చిన దానికి మేం పదిరెట్లు ఎక్కువ ఇచ్చాం. 

దళితులకు రాజకీయ సాధికారత వైఎస్‌ జగన్‌తోనే
సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మాదిగ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, రాజకీయంగా సాధికారిత కల్పిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గుర్ని ఎస్పీ కమిషన్‌ మెంబర్లుగా నియమించారు. నాలుగు మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్‌లుగా మాదిగలకు అవకాశవిుచ్చారు. గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి క్రిస్టినాకు ఇచ్చారు. డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌లుగా మరో ఇద్దరు మాదిగలకు ఇచ్చారు. మరో ఇద్దరు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌లు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, 46 మంది జెడ్పీటీసీలు, 55 మంది ఎంపీపీలు, 13 మంది మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు కూడా మాదిగ సామాజిక వర్గం వారే.

హెచ్‌ఆర్‌సీ సభ్యునిగా అత్యున్నత స్థాయి పదవిలో గొట్టిపోతుల శ్రీనివాసరావును నియమించారు. మంత్రివర్గంలో నాతో పాటు  తానేటి వనితను ఎంపిక చేశారు.  ఇద్దరు ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, బొమ్మి ఇజ్రాయేల్‌లను నియామకం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మాదిగ సామాజికవర్గానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత జగన్‌గారిదే. అవకాశం ఉన్న ప్రతి చోటా దళితులకు ఇవ్వాలనే తపన వైఎస్‌ జగన్‌ది.

దామాషాకు మించి.. దళితులకు వాటా
28 పైచిలుకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా నేరుగా పేదల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. వీటిలో దళితుల వాటా పెద్దది.  ఎస్సీల్లోని 37 ఉపకులాలు అన్నీ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని అనుకుంటుంటే చంద్రబాబుకి నచ్చడంలేదు. ఆయన మాటలను మాదిగలెవరూ నమ్మరు. ఈ పచ్చ తోడేళ్ల గుంపులో  దళితులెవ్వరూ భాగస్వామ్యం కావద్దని మంత్రి సురేష్‌ చెప్పారు. 

చదవండి: డిగ్రీ చేస్తే జాక్‌పాట్‌.. ఐటీ కంపెనీల క్యూ..

మరిన్ని వార్తలు