జగన్‌ పాలనలో సర్కారు వైద్యానికి మంచి రోజులు

22 Nov, 2020 03:45 IST|Sakshi

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణం

9,700 మెడికల్‌ పోస్టులు భర్తీ

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  

నరసాపురం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక  పాలనలో పారదర్శకత వచ్చిందని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సామాజిక ఆసుపత్రిని రూ.11.64 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా విస్తరించే అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను భ్రష్టు పట్టించిందని, ఆరోగ్యశ్రీని మూలన పెట్టిందని, శిథిలావస్థకు చేరిన సీహెచ్‌సీ, పీహెచ్‌సీ భవనాలకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదని విమర్శించారు.

కానీ తమ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కళాశాలల నిర్మాణం చేపడుతోందని, మరో 11 మెడికల్‌ కళాశాలలను ఆధునికీకరించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో, పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 9,700 పోస్టులు భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని, త్వరలో మరో 1,900 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, సబ్‌కలెక్టర్‌ విశ్వనాథన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు