గుండ్లకమ్మ నుంచి ఖరీఫ్‌కు నీరిస్తాం

4 Sep, 2022 04:04 IST|Sakshi
గడ్డర్లు ఊడిపోయిన మూడో గేటును పరిశీలిస్తున్న మంత్రి అంబటి రాంబాబు తదితరులు

రబీ  సీజనుకల్లా ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి 

అవసరమైతే సాగర్‌ కాలువల ద్వారా రిజర్వాయర్‌ నింపుతాం 

రిజర్వాయర్‌ మరమ్మతులను టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది  

పచ్చపత్రికలు చంద్రబాబు డైరెక్షన్‌లో వికృత రాతలు రాస్తున్నాయి 

నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు 

మద్దిపాడు: వచ్చే రబీ సీజన్‌కల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌కు, వచ్చే రబీ సీజన్‌లో పంటలకు ప్రాజెక్టు నుంచి నీరందిస్తామని, తాగు నీరు కూడా అందిస్తామని తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లాలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని పరిశీలించారు.

గడ్డర్లు ఊడిపోయిన మూడో గేటును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వాయర్‌లో నీటిని 1.25 టీఎంసీలకు తగ్గించి పనులు చేస్తామన్నారు. సాగు నీటి సరఫరాకు ఏ ఇబ్బందీ కలగదని, అవసరమైతే సాగర్‌ కాలువల ద్వారా రిజర్వాయర్‌ నింపుతామని తెలిపారు. మూడో నంబర్‌ గేటుతో పాటు మరో తొమ్మిది గేట్లకు మరమ్మతులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారన్నారు.

ఈ పనులకు కాంట్రాక్టర్‌ను కూడా ఖరారు చేశామని చెప్పారు. నీరు కిందకు పోవడంవల్ల రైతులకు నష్టం జరుగుతోందంటూ టీడీపీ అధినాయకుడి డైరెక్షన్‌లో పచ్చ పత్రికలు వికృత భాషలో వండి వారుస్తున్నాయని మండిపడ్డారు. గేటు విరగడం నిన్న, మొన్న జరిగింది కాదని, 2014 – 19 మధ్య టీడీపీ ప్రభుత్వం రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయించలేదని తెలిపారు.

వారి హయాంలో మరమ్మతులకు రూ.6 కోట్లు మంజూరు చేయించుకుని గేట్లు, స్పిల్‌వేను పట్టించుకోలేదని చెప్పారు. ఆ డబ్బుతో రిజర్వాయర్‌ వద్ద బ్యూటిఫికేషన్, గెస్ట్‌ హౌస్‌లు అంటూ టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. పచ్చ పత్రికలకు ఇవేమీ కనిపించవని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

పులిచింతలలో కొట్టు కుపోయిన గేటు రిపేరు చేస్తున్నామన్నారు. డ్యాములకు రిపేర్లు రావడం ఈ రోజు వచ్చిన సమస్య కాదని చెప్పారు. గత ప్రభుత్వం డ్యాముల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని డ్వామ్‌లకు మరమ్మతులు చేపడతామని అన్నారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదని ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందన్నారు.

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ రాకుండా కేంద్రానికి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు పర్యావరణ ఇబ్బందులు వస్తాయంటూ లేఖలు రాస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలకు మాత్రమే డ్రగ్‌ పార్కులకు అవకాశం దక్కిందన్నారు. డ్రగ్‌ పార్క్‌ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేలాది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అటువంటి ప్రాజక్టును అడ్డుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనమని చెప్పారు. 

మరిన్ని వార్తలు