అరుదైన మానవాకృతి స్మారకశిల గుర్తింపు

4 Sep, 2022 04:05 IST|Sakshi

భువనగిరి సమీపంలోని కేసారం గ్రామంలో వెలుగులోకి..

పాతరాతియుగం నాటిదని అంటున్న చరిత్రకారులు

సాక్షి, హైదరాబాద్‌: చేతులు చాచిన మానవరూపం మాదిరిగా కనిపిస్తున్న రాయి ఇది. పంటపొలాల్లో ఏర్పాటు చేసే దిష్టిబొమ్మలాంటిది కాదు, ఏ దేవతా శిల్పమో కూడా కాదు. ఇది పాతరాతి యుగం నాటి మానవ స్మారకశిల. ఆదిమానవులు తమ సమా­ధుల వద్ద నిలువురాళ్లు పాతే పద్ధతి పాటించేవారు. స్థానిక సమూ­హంలో ముఖ్యులుగా భావించేవారి సమాధుల వద్ద పాతే అలాంటి రాళ్లను మెన్హిర్లు అంటారు.

తెలంగాణలో అలాంటి నిలువు­రాళ్లు చాలాప్రాంతాల్లో ఇప్పటికీ ‘సజీ­వం’­గా ఉన్నాయి. కానీ, వాటికి మానవాకృతి అద్దిన మెన్హిర్లు మాత్రం చాలా అరుదు. ఆంత్రోపో మార్ఫిక్‌ ఫిగర్స్‌గా పేర్కొనే ఈ రాళ్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పరిమితంగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన స్మారక శిల ఇది. 

ఆరడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పు..
భువనగిరి పట్టణానికి 9 కి.మీ. దూరంలో ఉన్న కేసారం గ్రామ శివారులో దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్‌ గుర్తించినట్టు ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. భూమిలోకి లోతుగా పాతి ఉన్న ఈ శిల భూమి ఉపరితలంలో ఆరడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పుతో ఉందని, గుండ్రని తల, దీర్ఘచతురస్రాకారపు ఛాతీభాగం, భుజాలు, కిందికి నడుముభాగం పోల్చుకునేలా చెక్కి ఉందన్నారు.

గతంలో ఈ తరహా స్మారక శిలను జనగామ జిల్లా కొడకండ్లలో ఔత్సాహిక పరిశోధకులు గుర్తించారు. క్రీ.పూ.1,800 నుంచి క్రీ.శ.300 వరకు ఉన్న ఇనుపయుగంలో మానవ వికాసదశ అత్యున్నతస్థితికి చేరుకుందన్నది చరిత్రకారుల మాట. వ్యవసాయం బాగా నేర్చుకుని స్థిరనివాసానికి అలవాటుపడ్డ మానవుడు ఇలాంటి స్మారక శిలల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టారన్నది వారి అంచనా. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి మానవరూప స్మారకశిలలు లభించాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ శిలకు పురుష, మహిళ రూపాన్ని కూడా చెక్కిన దాఖలాలున్నాయి. కొడకండ్లలో లభించిన ఇలాంటి శిలను బయ్యన్న దేవుడుగా స్థానికులు పూజిస్తుండటాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. 

మరిన్ని వార్తలు