ఇప్పుడైనా సర్దుకుంటారా?

30 Dec, 2023 02:15 IST|Sakshi

కుదురుకుని సమన్వయంతో పనిచేస్తారా? 

అమిత్‌ షా క్లాస్‌తోనైనా మార్పు వస్తుందా! 

బీజేపీ రాష్ట్ర శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ 

అసెంబ్లీ ఫలితాల సమీక్ష, లోక్‌సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా షా వ్యాఖ్యలతో కలకలం 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ ముఖ్య నేతలకు క్లాస్‌ తీసుకోవడం, అందుకు దారితీసిన పరిణామాలపై రాష్ట్ర పార్టీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఫలితాల సమీక్ష, లోక్‌సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా గురువారం రాష్ట్ర నేతల వ్యవహారశైలిపై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా, క్రమశిక్షణను ఉల్లంఘించినా ఎంత పెద్ద నాయకుడినైనా చర్య తీసుకోకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చాంశనీయమయ్యాయి. రాష్ట్రంలో పార్టీకి పెరిగిన మద్దతు, వివిధ సమస్యలపై చేపట్టిన పోరాటం ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని భావిస్తే 8 సీట్లకే పరిమితం కావడం తమకు అసంతృప్తిని కలిగించిందని అమిత్‌ షా స్పష్టం చేసినట్టు తెలిసింది. 

ఆ ముగ్గురితో విడిగా భేటీ  
రాష్ట్ర కోర్‌కమిటీతో జరిగిన ఈ భేటీ ముగిశాక నేతలంతా బయటకు వెళుతుండగా, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయకార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ను వేచి ఉండాలని అమిత్‌ షా చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. అనంతరం ఆ ముగ్గురితో భేటీ అయ్యారని కొంతమంది, ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యారని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా ఆ ముగ్గురితో ప్రత్యేకంగా చర్చలు జరపడం చూస్తే వీరికి గట్టిగా క్లాస్‌ పీకారనే ప్రచారం పార్టీలో సాగుతోంది.

పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఉన్నప్పటి నుంచి ఆయనకు ఈటల రాజేందర్‌ మధ్య సరైన సమన్వయం లేకపోవడం, వీరి అనుచరులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని పరస్పరం బురదజల్లుకోవడం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన రహస్యమే. ఐతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ వీరి మధ్య ఆధిపత్యపోరు తగ్గకుండా సోషల్‌ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టడం వంటి వాటిపై అందిన రిపోర్ట్‌ ఆధారంగానే అమిత్‌ షా ఈ భేటీల్లో తీవ్రంగా స్పందించినట్టుగా చెబుతున్నారు. పార్టీ విస్తృత భేటీ సందర్భంగా కూడా వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా ఎడ మొహం, పెడమొహంగానే ఉన్నారే గానీ కనీసం మాట్లాడుకున్నట్టు కనిపించలేదని ఆ సమావేశానికి హాజరైన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా వారికి గట్టిగానే క్లాస్‌ పీకి ఉంటారని పార్టీ నాయకులు అంచనావేస్తున్నారు. 

భేటీ తర్వాత ఒకే ‘బండి’లో ఈటల 
భేటీ అనంతరం సంజయ్, ఈటల ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరుగుతున్న కొంగరకలాన్‌కు చేరుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. సమావేశంలో చేసిన తీర్మానాలపై మీడియాకు వీరిద్దరూ బైట్‌ ఇస్తారని తొలుత పార్టీ మీడియాసెల్‌ సమాచారం ఇచి్చంది. రాజకీయతీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఈటల దానికి సంబంధించిన విశేషాలను మీడియాకు వివరించారు. కానీ సంజయ్‌ మాత్రం మీడియా సమావేశానికి రాలేదు. ఏదేమైనా అమిత్‌ షా క్లాసుతోనైనా లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీలో అంతా సర్దుకుని నేతలంతా సమన్వయంతో పనిచేస్తారనే ఆశాభావం రాష్ట్ర శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.  

>
మరిన్ని వార్తలు