Sakshi News home page

అస్సాంలో కీలక పరిణామం.. ఉల్ఫాతో కేంద్రం శాంతి ఒప్పందం

Published Fri, Dec 29 2023 8:41 PM

Centre Assam Government Sign Peace Pact with pro Talks faction of ULFA - Sakshi

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ULFA), కేంద్రంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో శాంతి కోసం యూఎల్‌ఎఫ్‌ఏ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, యూఎల్‌ఎఫ్‌ఏ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంత‌కాలు చేశారు.

దీంతో ఈశాన్య రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా జరుగుతున్న (తిరుగుబాటు చర్యలకు) హింసాకాండకు ముగింపు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్ర‌మ వ‌ల‌స‌లు, తెగ‌ల‌కు భూమి హ‌క్కులు, అస్సాం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌చ్చే ఛాన్స్‌ ఉంది.

‘కాగా వేర్పాటువాద సంస్థ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం’ బంగ్లాదేశ్‌(ఒకప్పటి తూర్పు పాకిస్తాన్‌) నుంచి వచ్చిన వలసదారులకు వ్యతిరేకంగా, ప్రత్యేక అస్సాం డిమాండ్‌తో 1979లో ఏర్పడింది. తిరుగుబాటు పేరుతో ఆయుధాలను చేతపట్టిన ఆందోళనకారులు అనేక విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. దీంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం 1990లో నిషేధిత సంస్థగా ప్రకటించింది. అస్సాంలో ఉల్ఫా అత్యంత పురాత‌న తిరుగుబాటు ద‌ళంగా కొన‌సాగుతుంది. 
చదవండి: గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం..

అయితే ఫిబ్రవరి 2011లో అరబిందా రాజ్‌ఖోవా నేతృత్వంలోని వర్గం హింసను విడిచిపెట్టి, ప్రభుత్వంతో బేషరతు చర్చలకు అంగీకరించడంతో ఉల్ఫా రెండు గ్రూపులుగా విడిపోయింది. అరబింద సారథ్యంలోని ఉల్ఫా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2011  సెప్టెంబర్‌ 3న తొలిసారి శాంతి చర్చలు జరిపింది. అయితే పరేశ్‌ బారుహ్‌ నేతృత్వం వహిస్తున్న ఉల్ఫా (స్వతంత్ర) వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పరేశ్‌.. చైనా-మయన్మార్‌ సరిద్దులో తలదాచుకున్నట్లు సమాచారం. 

ఈరోజు అస్సాంకు చారిత్రాత్మకమైన రోజని హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయని, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్రం, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేశారని తెలిపారు. ఉల్ఫా హింసాకాండ కారణంగా అస్సాం చాలా కాలంగా నష్టపోయిందన్నారు. 1979 నుంచి ఈ హింసలో 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ద‌శ‌ల వారీగా ఉల్ఫా డిమాండ్ల‌ను తీరుస్తామ‌ని అమిత్ షా తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement