TS: బీజేపీ నేతలకు ‘షా’ టార్గెట్‌ ఇదే ! | Amit Shah Sets Target For Telangana BJP Leaders - Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీ నేతలకు ‘షా’ టార్గెట్‌ ఇదే !

Published Fri, Dec 29 2023 5:08 PM

Amit Sha Sets Target For Telangana Bjp Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అమిత్ షా పర్యటనపై కమలనాథులు ఏమనుకుంటున్నారు ? ఇక్కడ పార్టీ పరిస్థితులు షా చక్కదిద్దారా ? బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య వివాదం సమిసిపోయిందా ? అసలు నేతలకు అమిత్ షా చెప్పిన గెలుపు సూత్రం ఏంటి ? పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు చేసిన మార్గదర్శనం ఏంటి?  

తెలంగాణ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. అధికారం సాధించే వరకు తెలంగాణకు వస్తూనే ఉంటానని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్ , బండి సంజయ్ మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పై ప్రధానంగా చర్చించారు. బీజేపీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి సమక్షంలోనే అమిత్ షా.. ఆ ఇద్దరికి క్లాస్ తీసుకున్నారట. కలిసి వెళ్లకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట.

సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకోవడం పద్దతి కాదంటూ గట్టిగా చెప్పారట. నేతల మధ్య సమన్వయ లేమి సమస్య మరోసారి రిపీట్ కాకుండా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని అమిత్ షా సూచించారు. తెలంగాణ కమల దళం ఎదుర్కొంటున్న సమన్వయ లేమి సమస్యకు అమిత్‌ షా పరిష్కారం చూపించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో.. 10 సీట్లను సాధిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని నేతలకు అమిత్ షా భరోసా ఇచ్చారు. నేతలను సమన్వయం చేసుకునే బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయిన పార్టీ అని... కాంగ్రెస్ మునిగిపోనున్న పార్టీ అని నేతలతో భేటీలో అమిత్‌ షా అన్నట్లు సమాచారం. తెలంగాణలో  భవిష్యత్ బీజేపీ దేనని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు అమిత్ షా.

మరోవైపు ఈటల రాజేందర్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్‌కు అటు.. ఇటు ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలే... కొండా, ఈటల పార్టీ వీడుతున్నారనే ప్రచారం చేయిస్తున్నారని వీరిద్దరి అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో పది సీట్లు కొట్టాలని భావిస్తున్న కమలనాథుల ఆశలు ఏ మేరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి.

దీచదవండి..ప్రజాభవన్‌ ఘటనలో కొత్త కోణం.. మాజీ ఎమ్మెల్యే తనయుడిని ఎలా తప్పించారంటే

Advertisement
Advertisement