‘తెలంగాణలో దూకుడు పెంచండి’

7 Dec, 2020 03:45 IST|Sakshi
ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను శాలువాతో సత్కరిస్తున్న మాజీ ఎంపీ విజయశాంతి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు దూకుడు పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చూపిన పంథానే ఇకముందు కూడా కొనసాగించాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి , సీనియర్‌ నేత వివేక్‌ వెంకట్‌స్వామి, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతిలతో కలసి ఆదివారమిక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అమిత్‌షాతో భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను ఆయనకు వివరించారు. ఓట్ల శాతంతోపాటు సీట్ల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. దుబ్బాక ఫలితం అనంతరం జీహెచ్‌ఎంసీ ఫలితాలు కూడా సానుకూలంగా రావడంతో నేతలు, కార్యకర్తలందరినీ అమిత్‌ షా అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి బీజేపీలో చేరుతున్న విషయాన్ని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ సభ్యత్వం తీసుకోనున్నారు. అదేరోజు సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 

ఉద్యమకారులను కేసీఆర్‌ విస్మరించారు: సంజయ్‌
అమిత్‌షాతో సమావేశం అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల్లో చేరిన విజయశాంతి మళ్లీ ఇప్పుడు మాతృసంస్థకు రావడం సంతోషం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలైన తెలంగాణ ఉద్యమకారులను సీఎం కేసీఆర్‌ విస్మరించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ చేస్తున్న పోరాటాన్ని ఉద్యమకారులు గుర్తించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ ఎన్నికలైనా ఒకే తరహా పోరాటం చేస్తాం. గెలుపోటములను సమంగా స్వీకరిస్తాం’ అని సంజయ్‌ తెలిపారు. 

బీజేపీలో చేరనున్న మహిళా పైలెట్‌ 
తెలంగాణ గిరిజన మహిళాపైలట్‌ అజ్మీరా బాబీ బీజేపీలో చేరనున్నారు. ఆదివారం అమిత్‌షాను కలసిన సంజయ్‌ బృందంలో ఆమె కూడా ఉన్నారు. సోమవారం ఉదయం విజయశాంతితోపాటు అజ్మీరా కూడా పార్టీలో చేరననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు