షాబాజ్‌ అహ్మద్‌ సూపర్‌ సెంచరీ.. ఆర్సీబీని వీడితేనే బాగుపడతారంటున్న ఫ్యాన్స్‌

11 Dec, 2023 15:48 IST|Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో భాగంగా హర్యానాతో ఇవాళ (డిసెంబర్‌ 11) జరుగుతున్న తొలి క్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌ ఆటగాడు, ఆర్సీబీ మాజీ ప్లేయర్‌ షాబాజ్‌ అహ్మద్‌ సూపర్‌ సెంచరీతో (118 బంతుల్లో 100; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా షాబాజ్‌  ఒంటరిపోరాటం చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు.

షాబాజ్‌ ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది. షాజాబ్‌ తర్వాత బెంగాల్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ పోరెల్‌ చేసిన 24 పరుగులే అత్యధికం. కెప్టెన్‌ సుదీప్‌ ఘరామీ (21), ప్రదిప్త ప్రమానిక్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్‌ (4/37), సుమిత్‌ కుమార్‌ (2/27), రాహుల్‌ తెవాటియా (2/32) బెంగాల్‌ పతనాన్ని శాశించారు.

అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన హర్యానా 30 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. అంకిత్‌ కుమార్‌ (82 నాటౌట్‌) హర్యానాను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. 

ఈ మ్యాచ్‌లో షాబాజ్‌ అహ్మద్‌ బాధ్యతాయుతమై సెంచరీతో రాణించడంతో బెంగాల్‌ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ ట్రేడింగ్‌లో షాబాజ్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టినందుకు గాను ఆర్సీబీపై దుమ్మెత్తిపోస్తున్నారు. షాబాజ్‌ను ఆర్సీబీ వదిలిపెట్టడమే మంచిదైందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీని వీడితేనే ఆటగాళ్లు బాగుపడతారంటూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

కాగా, అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ మయాంక్‌ డాగర్‌ కోసం​ ఆర్సీబీ షాబాజ్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ట్రేడింగ్‌ పద్దతిలో షాబాజ్‌ను వదిలేసిన ఆర్సీబీ.. వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్‌లను కూడా వేలానికి వదిలిపెట్టింది. ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్‌లో జరుగనుంది.

>
మరిన్ని వార్తలు