ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే బిల్లును తీసుకొచ్చారు: కపిల్ సిబాల్

20 Sep, 2023 09:33 IST|Sakshi

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పార్లమెంటులో చర్చ కంటే ముందే బిల్లుపై కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పర విమర్శలకు తెరతీశారు.  దీనిపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ స్పందిస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే బీజేపీ ఈ స్టంట్ చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీ హయాంలో ఏంచేశారని అన్నారు.

  

ఈసారైనా..  
చాలా కాలంగా మరుగునపడిపోయిన బిల్లుకు మోక్షం కలిగిస్తూ బీజేపీ ప్రభుత్వ కేబినెట్ సోమవారమే బిల్లును ఆమోదించి మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో కూడా అనేక సార్లు ఈ బిల్లు తెరపైకి వచ్చినప్పటికీ బిల్లుకు మాత్రం ఆమోదం పొందలేదు. ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సంఖ్యాబలం కూడా బాగానే ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు ఈసారి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లుపై బుధవారం చర్చలు జరగనున్నాయి. 

ఎన్నికల వేళ.. 
ఇదిలా ఉండగా బిల్లుపై చర్చ జరగక ముందే పాలక ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి తెర తీశారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి పొలిటికల్ మైలేజీ పొందాలని చూస్తోందంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. మేము చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నది వారి ఆలోచన అన్నారు. వారికి ఏ బిల్లుపై అంట చిత్తశుద్ధే ఉంటే బిల్లును 2014లోనే ప్రవేశ పెట్టి ఉండాల్సిందన్నారు. ఈ బిల్లుకంటే ముందే వారు జనగణన చేపట్టాల్సి ఉందని అన్నారు. 

మీరు చేసిందేంటి.. 
కపిల్ సిబాల్ వ్యాఖ్యలకు అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2008లో మొట్టమొదటిసారి ఈ బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు మీరు న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు మీరు చేసిందేంటి? ఆ తర్వాత ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బిల్లుని ప్రవేశపెట్టినట్టు నటిస్తోందన్న విషయం మీకు కూడా తెలుసు కదా అని ప్రశ్నించారు. ఏదైతేనేం అప్పట్లో బిల్లును ఆమోదించకుండా ముసాయిదా చట్టాన్ని స్టాండింగ్ కమిటీకి పంపించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు, ఇప్పుడు ఈ బిల్లు పాస్ అవ్వాలన్న ఉద్దేశ్యమే లేదని అన్నారు. నేహరూ పరిపాలనలో గాని, ఇందిరా గాంధీ హయాంలో గాని, రాజీవ్ గాంధీ పాలనలో గానీ చివరికి సోనియా గాంధీ హయాంలో కూడా మహిళలకు వారు ప్రాధాన్యతనిచ్చిందే లేదని అన్నారు. 

ఇది కూడా చదవండి: వారిది 'జన ఆశీర్వాద యాత్ర'.. వీరిది 'జన ఆక్రోశ యాత్ర'..   

మరిన్ని వార్తలు