గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్‌!

25 Jan, 2024 12:31 IST|Sakshi

టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత తొలిసారి స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాను స్పీకర్‌గా ఆమోదించడంలో రాజకీయ కుట్ర ఏముందని తమ్మినేని ప్రశ్నించారు.

గడువు తర్వాతే నిర్ణయం..
గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను నాకు ఎప్పుడో ఇచ్చారు. పైగా స్పీకర్‌ ఫార్మాట్‌లోనే ఆయనే ఇచ్చారు. ఎమ్మెల్యేగా తప్పుకుంటానని తెలిపారు. లేఖ ఇవ్వగానే ఆమోదించడం సరికాదని వేచిచూశాం. మనసు మార్చుకుంటాడన్న మానవతా దృక్పథంతో ఇప్పటివరకు ఆగాను. ఇప్పుడు స్పీకర్‌గా నా పదవీకాలం ముగుస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చినా నిర్ణయాన్ని మార్చుకోలేని ఇప్పుడెలా మార్చుకుంటాడని భావించాను. పదవీ కాలం సమీపిస్తుండడంతో రాజీనామాను ఆమోదించాను.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అ­మ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి..

ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు ఏదైనా భిన్నంగా ఆలోచిస్తే.. కోర్టుల ద్వారా ముందుకు వెళ్లొచ్చు. రాజీనామా ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం అనేది సరికాదు. చట్టసభల విషయంలో నియమ నిబంధనలను పాటించాలి. ఒక వేళ గంటా శ్రీనివాసరావు ఓటుతోనే అధికార పార్టీ రాజ్యసభ సీట్లు ఆధారపడిలేవు కదా. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సీటు కోల్పోతుంది అని ప్రచారం చేస్తున్న విషయమే కరెక్టయితే అందరికీ నోటీసులు ఎందుకు ఇస్తాం? ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇచ్చాను. వారంలోపు అన్ని పిటిషన్లు క్లియర్ చేస్తాం. 

స్పీకర్ లేఖలు..
ఒక పార్టీ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరుకునపడ్డారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఇప్పటికే అనర్హతా వేటు ఎదుర్కొంటున్నారు. వీరిపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయడంతో స్పీకర్‌ వీరికి నోటీసులిచ్చారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది. 

వారంలో ఏం జరగనుంది?
స్పీకర్‌గా తన పదవీ కాలం సమీపిస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై వారంలోగా నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని ప్రకటించడం తెలుగుదేశంలో గుబులు రేపుతోంది. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన నలుగురిని వెంటనే లాగేసుకున్న చంద్రబాబు.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురికి తెలుగుదేశం టికెట్‌ ఇచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. పక్కపార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. 2014-19 మధ్య ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా బోలెడు డబ్బు గుమ్మరించి లాగేసుకున్న చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టారు ఓటర్లు. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. అనర్హతా పిటిషన్‌పై స్పీకర్‌ నిర్ణయం తీసుకుని వేటు వేస్తే.. ఈ నలుగురు కూడా పోటీ చేసేందుకు అర్హతా కోల్పేయే అవకాశం ఉంది.

అది స్పీకర్‌ విశిష్టాధికారం
అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయం. స్పీకర్ వ్యవస్థ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. గంటా రాజీనామాను ఆమోదించాలన్నది స్పీకర్ నిర్ణయం. ఎప్పుడు ఆమోదించాలో అన్నది కూడా ఆయన నిర్ణయమే. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు YSRCP గెలుస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తుందనుకుంటారు? అసలు టీడీపీకి తగినంత సంఖ్యాబలమే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega