సీఎం పాలన వల్లే బంపర్‌ మెజారిటీ

3 Nov, 2021 04:46 IST|Sakshi
సుధకు పూలమాల వేస్తున్న కుమార్తె

 సీఎం వైఎస్‌ జగన్‌ మాటలే నాకు స్ఫూర్తి

‘సాక్షి’తో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ

బద్వేలు: సీఎం వైఎస్‌ జగన్‌ హామీలను విశ్వసించి ఇక్కడి ప్రజలు అప్పట్లో తన భర్తకు 45 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని.. ప్రస్తుత రెండున్నరేళ్ల పాలనలో సీఎం ఆ హామీలను అమలు చేయడం చూసి, ఇప్పుడు అంతకు రెట్టింపు మెజారిటీ ఇచ్చారని వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్‌ దాసరి సుధ అన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన అనంతరం ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు.. 

సాక్షి: రాజకీయాల్లోకి వస్తానని ఊహించారా? 
సుధ: మాకు రాజకీయాలు కొత్త. గతంలో కూడా మా కుటుంబీకులెవరూ ఎన్నికల్లో పోటీచేయలేదు. నా భర్త 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున బద్వేలు నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన హఠాన్మరణంతో ఆయన సేవను కొనసాగించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా. 

సాక్షి: ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి.. పోరాడడానికి స్ఫూర్తి ఎవరు? 
సుధ: సీఎం వైఎస్‌ జగన్‌ మాటలే నాకు స్ఫూర్తి. భర్త మరణం తరువాత సీఎంగారు పరామర్శకు వచ్చారు. జరిగిన విషాదాన్ని త్వరగా మర్చిపోవాలంటే ప్రజాసేవ ఒకటే మార్గం.. ప్రజలకు మంచి చేస్తే కలిగే సంతృప్తి ముందు విషాదం పెద్ద విషయం కాదు, మీరు పోటీచేయండి.. తోడ్పాటు అందిస్తామని ఉత్సాహపరిచారు. దీంతో తక్కువ సమయంలోనే నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సిద్ధపడ్డా. 

సాక్షి: ఇంత మెజారిటీ వస్తుందని ఊహించారా? 
సుధ: తప్పకుండా వస్తుందని అనుకున్నాం. అనుకున్న దానికంటే 5 నుంచి 10 వేలు తక్కువే వచ్చాయి. వర్షాలు పడటంతో చాలామంది ఓటింగ్‌కు రాలేదు. బీజేపీకి 90% ప్రాంతాల్లో ఏజెంట్లు ఉండరనుకున్నాం. కానీ, టీడీపీతో కుమ్మక్కై ప్రలోభాలతో ఆ పార్టీ నేతలను ఏజెంట్లుగా కూర్చోబెట్టారు. బీజేపీకి ఓట్లు వేయాలని టీడీపీ ముఖ్య నేతలు చెప్పడంతోనే కొంత మెజారిటీ తగ్గింది. 

సాక్షి: బద్వేలుకు ఏం చేయాలనుకుంటున్నారు? 
సుధ: 4 నెలల కిందట సీఎం వైఎస్‌ జగన్‌ బద్వేలు అభివృద్ధికి రూ.700 కోట్లు పైగా నిధులు ప్రకటించారు. ఎన్నికల కోడ్‌తో ఈ పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం త్వరితగతిన వీటన్నింటిని పూర్తిచేయడమే లక్ష్యం. బద్వేలు మున్సిపాలిటిలో రోడ్లు, డ్రైనేజీ పనుల పూర్తికి ప్రత్యేక కృషిచేస్తాం. 

సాక్షి: నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక ఉందా? 
సుధ: నియోజకవర్గంలో సాగునీటి వనరులు ఇప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధతో మెరుగయ్యాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరికేలా చూడాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. వ్యవసాయాధారిత పరిశ్రమలతో పాటు ఇతర ఉపాధి మార్గాలను అధ్యయనం చేస్తా. ముంపు వాసుల సమస్యలు పరిష్కరించాలి.  

సాక్షి: డాక్టర్‌గా వైద్య సేవలను ఎలా మెరుగుపరుస్తారు? 
సుధ: నా భర్త డాక్టర్‌ కావడంతో ప్రజల ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించేవారు. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సీహెచ్‌సీ, సీమాంక్‌ ఆసుపత్రుల్లో ఉత్తమ వైద్యం అందేలా చూస్తా. డయాలసిస్‌ రోగులు దూరంగా ఉన్న కడపకు వెళ్లి డయాలసిస్‌ చేసుకుంటున్నారు. డెల్‌ కంపెనీ సహకారంతో బద్వేల్‌లోనే డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు కృషిచేస్తా. ఇది నా భర్త మొదలు పెట్టారు. దీన్ని పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నా. 

సాక్షి: మహిళాభివృద్ధికి ఎలా కృషి చేస్తారు? 
సుధ: యువతకు వృత్తివిద్యా కోర్సులను నేర్పించి స్థానికంగా ఉపాధి లభించేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలను ఉపయోగించుకునేలా చూస్తా. స్థానికంగానే ఉంటూ నిరంతరం యువత, మహిళలతో అనుబంధం పెంచుకుంటూ వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా.

అందరికీ కృతజ్ఞతలు
నా విజయానికి తోడ్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు. నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు అందించిన సహకారం మరువలేనిది. వీరంతా నా విజయానికి ఎంతో కష్టపడ్డారు. నా కుటుంబ సభ్యులు సైతం కష్టకాలంలో అండగా నిలిచారు. వీరందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తా. 

మరిన్ని వార్తలు