ఈనాడు ఫోటోగ్రాఫర్‌పై బాలకృష్ణ చిందులు

24 Sep, 2023 07:28 IST|Sakshi

రాజమహేంద్రవరం: నందమూరి బాలకృష్ణ తన నైజాన్ని ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లపై బాలయ్య చిందులు తొక్కారు. రాజమహేంద్రవరం విద్యానగర్‌లోని లోకేశ్‌ క్యాంప్‌ ఆఫీసు వద్ద శనివారం పార్టీ నేతలతో బాలకృష్ణ మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై ఆయన మండిపడ్డారు. క్యాంప్‌ వద్ద ఉన్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌పై ఆయన తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు. తాను ఈనాడు ఫొటోగ్రాఫర్‌నని ఆయన చెబితే.. ‘అయితే ఏంటి **..’ అంటూ బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది.

బాలకృష్ణ పలు సందర్భాల్లో ఇలా ప్రవర్తించడం అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఏం మాట్లాడాతాడో, ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో బాలకృష్ణకే తెలియదు. గతంలో అభిమానులపై కూడా బాలకృష్ణ చిందులు తొక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆవేశంలో బూతులు మాట్లాడిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా యెల్లో మీడియాలో భాగమైన ‘ఈనాడు’పైనే ఆగ్రహం వ్యక్తం చేశాడంటే ఆయన ఫస్ట్రేషన్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన బావ చంద్రబాబు కేసులో ఇరుక్కుని రిమాండ్‌కు వెళ్లడం, ఆయన అల్లుడి ఢిల్లీలో మకాం వేయడంతో ఏం చేయాలో తోచక సహనం కోల్పోతున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు. 

అయితే, అది ఆయన సహజశైలినో, నైజమో అర్థం కాక అభిమానులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీకి ఎప్పుడూ డబ్బా కొట్టే ఈనాడుకు చెందిన ఫోటోగ్రాఫర్‌పైనే బాలయ్య అసహనం ప్రదర్శించాడంటే పార్టీని, చంద్రబాబును మరింత కష్టాల్లోకి నెట్టేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. మరి బాలకృష్ణ అంతేలే అని ఈనాడు అధినేత రామోజీరావు సరిపెట్టుకుంటారో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు