వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోరా!

9 Sep, 2021 02:58 IST|Sakshi
పాదయాత్రలో ప్రజలకు  అభివాదం చేస్తున్న బండి సంజయ్‌ 

సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో ఏం చేస్తున్నారు? 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

జోగిపేట (అందోల్‌): రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదల కారణంగా ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో ఏం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. బుధవారం ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా అందోల్‌ నియోజకవర్గంలోని శివ్వంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరదలతో పంటలు నష్టపోతే రాష్ట్రంలో ఏడేళ్లలో ఏఒక్క రైతును ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.

రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్‌ మీద అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌లో పంటలు పండించి కోట్లు సంపాదిస్తుంటే 50 ఎకరాలున్న రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. రైతులను సన్నరకం వడ్లు పండించాలని చెబుతూ కేసీఆర్‌ మాత్రం ఫామ్‌ హౌస్‌లో దొడ్డు రకం పండిస్తున్నారని ధ్వజమెత్తారు. వరదల్లో నష్టపోయిన రైతలకు పరిహారం చెల్లించాలన్నారు. యువతకు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశారని, జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తానని చెప్పి ఎక్కడా ఇవ్వలేదని అన్నారు. 

పండుగలకు పర్మిషన్‌ కావాలా? 
హిందువులు పండుగ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలా? అని బండి సంజయ్‌ ప్రశ్నిం చారు. హిందువులు పండుగలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి కావాలనడం దుర్మార్గమని మండిపడ్డారు. వినాయక చవితి పండుగకు ఆంక్ష లు పెట్టొద్దని డీజీపీని హెచ్చరించారు.  

డ్రగ్స్‌ వాడుతున్న టీఆర్‌ఎస్‌ లీడర్లు 
టీఆర్‌ఎస్‌ పార్టీలోని ముఖ్య నాయకులు చాలా మంది మాదక ద్రవ్యాలు వాడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలు చేయిస్తామని బండి సంజయ్‌ అన్నారు.

హుజురాబాద్‌ ప్రచారానికి అమిత్‌షా... 
శుక్రవారం వినాయక చవితి పండుగ సందర్భంగా, 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బహిరంగసభ సందర్భంగా రెండురోజుల పాటు పాదయాత్రకు బండి సంజయ్‌ విరామం పాటించనున్నారు.  అక్టోబర్‌ 2న బాసరలో తొలివిడత పాదయాత్రను ముగించాలని తొలుత భావించినా, ఈ నెల 17న అమిత్‌షా సభ నేపథ్యంలో హుజురాబాద్‌ వైపు దానిని మార్చాలని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు