తలసానితో కలిసి ఇళ్లను పరిశీలించా: భట్టి

17 Sep, 2020 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి గ్రేటర్‌ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను గురువారం పరిశీలించారు. జియాగూడ, గోడే ఖబర్‌, అంబేడ్కర్‌ నగర్‌లో ఇళ్లను పరిశీలించిన వారిద్దరూ... కట్టెలమండి, సీసీనగర్‌, కొల్లూరులోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పరిశీలనకు వెళ్లారు. కాగా, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లెక్కలపై కాంగ్రెస్‌, అధికార టీఆర్‌ఎస్‌ నేత మధ్య శాసనసభలో నిన్న వాడీవేడీ చర్చ నడిచింది. ప్రభుత్వం కట్టిన ఇళ్లను చూపెట్టాలని భట్టి విసిరిన సవాల్‌ను మంత్రి తలసాని స్వీకరించారు. ఆ మేరకు మంత్రి తలసాని ఈరోజు ఉదయం నేరుగా భట్టి ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పరిశీలనకు తీసుకెళ్లారు.
(చదవండి: భట్టి సవాలును స్వీకరించిన తలసాని)

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 3,428 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పరిశీలించాం. ఉదయం నుంచి ఇళ్లను పరిశీలిస్తున్నాం. 2 లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఇవాళ నాలుగు చోట్ల తిరిగాం. రేపు ఎల్లుండి ఇళ్లను పరిశీలిస్తాం. మంత్రి తలసాని, మేయర్‌తో కలిసి ఇళ్లను పరిశీలించాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల క్వాలిటీపై ఇంజినీరింగ్‌ బృందం పరిశీలిస్తోంది. మొత్తం ఇళ్లు చూశాక నా నిర్ణయం ప్రకటిస్తా. రాజీవ్ గృహకల్ప ఇళ్లు కట్టించి చాలా ఏళ్లయింది. వాటికి వీటికి తేడా చూడాలి’ అన్నారు.

కేసీఆరే స్వయంగా డిజైన్‌ చేశారు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని చాలా చోట్ల డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ అన్నారు. కొల్లూరు, ఎల్బీనగర్, ముషీరాబాద్ లాంటి చోట్ల రేపు పరిశీలనకు వెళతామని చెప్పారు. పేదవారికి గూడు ఉండాలని స్వయంగా సీఎం కేసీఆరే ఈ ఇళ్లను డిజైన్‌ చేశామని మంత్రి తెలిపారు. మారేడ్ పల్లి అనేది హౌసింగ్ బోర్డ్ స్థలమని, జీహెచ్ఎంసీ దానిని స్వాధీనం చేసుకొని ఇళ్లు కట్టడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. అయినప్పటికీ పేదలందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో వాటిల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. పేదవాడు గొప్పగా బతకాలని కోటి రూపాయల విలువ ఉండే ఈ ఇళ్లను ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. పేదల నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మరో 50చోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు.
(చదవండి: ఎల్‌ఆర్‌ఎస్‌ జీవో 131 ని సవరిస్తూ ఉత్తర్వులు)

మరిన్ని వార్తలు