చెప్పింది చేయండి... లేదా బయటికి పోండి!

18 Dec, 2023 19:16 IST|Sakshi

టీడీపీతో పొత్తును విమర్శిస్తే ఊరుకోను

జనసేన కేడర్‌కు పవన్ హెచ్చరికలు

పూర్తిగా చంద్రబాబు బానిసగా మారిన సేనాని

జనసైనికుల్లో కలవరం.. మన టైం వస్తుంది చూద్దాం అని నిర్ణయం

గంగ మెల్లగా చంద్రముఖిగా మారినట్లు.. మొత్తానికి పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు పాలేరు రూపాన్ని సంతరించుకుంటున్నారు. ఎంతవరకూ దిగజారిపోయారు అంటే తనను ఎవరైనా ఏమన్నా పడతాను కానీ చంద్రబాబును ఏమన్నా అంటే ఊరుకునేది లేదని సొంత కేడర్‌కు వార్నింగ్‌ ఇచ్చే స్థాయికి దిగిపోయారు. ఎవరు ఏమనుకున్నా.. ఏమైపోయినా తనకు అనవసరం అని చెబుతూ టీడీపీతో పొత్తు విషయంలో ఎవరూ కిక్కురుమనొద్దని అల్టిమేటం ఇచ్చారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం అని ఆయన చెబుతున్నా.. తన ఆశయం మాత్రం చంద్రబాబు వెంటే అని తేల్చి చెప్పేశారు. ఇష్టమైనవాళ్లు తనతో ఉండొచ్చు.. లేనివాళ్లు వెళ్లిపోవచ్చని తేల్చేశారు. ఇది కాస్తా జనసైనికుల్లో ఆలోచనలకు దారితీసింది. ఆయన వెనుక పదేళ్లుగా మనం ఉన్నాం.. అసలు ఆయనకు ఉన్న క్యాడర్, ప్రజాభిమానం, యువత.. వీళ్ళను చూసే కదా ఆయనకు చంద్రబాబు అయినా కేంద్రంలోని మోదీ అయినా విలువ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నది. 

మరి అలాంటిది తమనే ఉంటే ఉండండి .. పొతే పోండి నా దారి చంద్రబాబు దారి అని తేల్చి చెప్పేశారు అంటే ఆయన ఆల్రెడీ అమ్ముడైపోయాడా? అనే సందేహం క్యాడర్లో ముప్పిరిగొంటున్నది. ఇప్పుడే ఇలా ఉంటే అసలు మనకు టికెట్స్ అయినా వస్తాయా.. మనం డిమాండింగ్ పొజిషన్‌లో ఉండాల్సింది పోయి బెదిరించే స్థాయికి తెచ్చేశాడా?. అసలు మనపార్టీకి కూడా చంద్రబాబే సీట్లు కేటాయిస్తాడా?. ఆయన ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకుని కిమ్మనకుండా ఉండాలా?. మనమంతా పవన్ కోసం పోరాడుతుంటే.. ఆయన వెళ్ళి చంద్రబాబు పల్లకీ మోసేందుకు రెడీ అవుతున్నాడు.. ఇదంతా గందరగోళంగా ఉంది. చూద్దాం.. మున్ముందు మనల్ని సరిగా గౌరవించకుంటే మనదారి మనం చూసుకోవడం మేలు అనే భావనలోకి వచ్చేశారు. 

మొదటి నుంచి ఉప్పు-నిప్పు 
ఇదిలా ఉండగా.. కాపు-కమ్మ సామాజికవర్గాల మధ్య దశాబ్దాల నుంచీ ఉప్పునిప్పు అన్నట్లుగా ఉంటుంది. కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా హత్య వెనుక చంద్రబాబు పాత్ర కీలకం అని ఎంతోమంది నాయకులు ఆరోపించారు. కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య సైతం తాను రాసిన పుస్తకంలో ఈ అంశాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. దీంతో పాటు చంద్రబాబు తనను చంపడానికి ప్రయత్నించారని ఇంకో కాపునేత కన్నా లక్ష్మీనారాయణ సైతం అప్పట్లో ఆరోపించారు. కానీ, మళ్ళీ ఆయనే టీడీపీలో చేరారు. ఇలా మొదటి నుంచి కమ్మ, కాపు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి.. ఇప్పటికీ ఉన్నాయి.

కానీ, పవన్ మాత్రం చంద్రబాబు పల్లకీ మోయడానికి ఇంతలా బరితెగించడం ఏమిటని కాపు నేతలు అంటున్నారు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. ప్యాకేజీ కోసం తమను తాకట్టుపెట్టడం దారుణం అని కాపులు అంటున్నారు. చంద్రబాబు విదిల్చే గుప్పెడు సీట్ల కోసం తామంతా పవన్ వెనకాల వెళ్లి ఊడిగం చేయాలా?. అదేదో పవన్ సొంతంగా పోటీ చేసినా ఆమాత్రం సీట్లు గెలవకపోతారా ? మరి ఎందుకు ఈ పరిస్థితి.. మా కులాన్ని మొత్తం తాకట్టు పెట్టడం అనే రుసరుసలు వినిపిస్తున్నాయి.
-సిమ్మాదిరప్పన్న

>
మరిన్ని వార్తలు