సీట్ల బేరం కుదిరిందా?.. ప్యాకేజీ పెరిగిందా..

18 Dec, 2023 18:50 IST|Sakshi

మొత్తానికి నారా లోకేష్ అలకలు.. పవన్ చిరాకులు.. పరాకులు ఇవన్నీ ముగిశాయి. చంద్రబాబు ఆదివారం రాత్రి పవన్ ఇంటికి వెళ్లి ఏం చెప్పారో.. ఏం ఆఫర్ ఇచ్చారో కానీ పవన్ మెత్తబడిపోయారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు వస్తానని చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులకు చేసే పనులకు పొంతన ఉండదని మరోమారు రుజువైంది.

అవసరమైతే తల తెగ్గోసుకుంటాను అని ఎన్నోసార్లు చెబుతూనే ఉంటారు కానీ మళ్లీ మళ్లీ చంద్రబాబు వద్ద తలవంచుతూనే ఉంటారు. అదే విషయం మళ్లీ రుజువైంది. తన సభకు పవన్ వస్తే తనకు ప్రయార్టీ తగ్గిపోతుందని, కుర్రాళ్ళు కూడా పవన్ సీఎం.. పవన్ సీఎం అని అరిస్తే తన పాదయాత్ర ఆయాసం మొత్తం గాలికి కొట్టుకుపోతుందని ఆందోళన చెందిన లోకేష్ అలకబూనారు.. రెండ్రోజులు తండ్రితో సైతం మాట్లాడకుండా మిన్నకున్నారు. ఈ విషయం గుర్తించిన పవన్ సైతం ఆ సభకు రావడం లేదని చెప్పేసారు. ఇదే అంశాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ధృవీకరించారు.

దీంతో పాటు తనకు సీట్లు కూడా బాగా తక్కువ ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో జనసేన సాధించిన ఓట్లను చూసిన చంద్రబాబు ఏకంగా పాతిక ముప్పై సీట్లకు బేరాన్ని కుదించేసినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ సైతం అలిగారు. ఇక పవన్ రాకపోతే అంతపెద్ద ప్రోగ్రాం సక్సెస్ కాదని, పవన్‌కు ఓట్లు లేకున్నా వెర్రెక్కి అరిచే కుర్ర జనాలు ఉన్నారని గుర్తించిన చంద్రబాబు మెల్లగా పవన్‌ను ఒప్పించడానికి ఆయన ఇంటికి వెళ్లారు.  

హైదరాబాద్ మాదాపూర్‌లోని పవన్ ఇంట్లో వారు మాట్లాడుకున్నారు. ఏపీ ఎన్నికల వ్యూహాలు, టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు, మ్యానిఫెస్టో అంశంపై చర్చల కోసం వెళ్ళమని చెబుతున్నా అసలు కారణం మాత్రం సేనానిని లొంగదీసేందుకే వెళ్లినట్లు తెలుస్తోంది. డబ్బుతోనో.. ఇంకేదో ఆశ చూపి పవన్‌ను భోగాపురంలో జరిగే యువగళం ముగింపు సభకు వచ్చేలా ఒప్పించారు.

వచ్చే ఎన్నికల్లో 50 ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ టికెట్లను పవన్‌ అడుగుతుండగా, పాతిక  ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ టికెట్ల దగ్గర చంద్రబాబు బేరం క్లోజ్ చేసినట్లు చెబుతున్నారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలా నెలకోసారి చంద్రబాబు భుజంమీద చెయివేయగానే లొంగిపోతే ఇక మనకు ఎన్ని సీట్లు ఇస్తారు. ఇలాగైతే పార్టీ నడుస్తుందా అని మూతి తిప్పుతున్నారు. 
-సిమ్మాదిరప్పన్న

>
మరిన్ని వార్తలు