CM Nitish Kumar: చూస్తూ ఊరుకోవాలా? అన్నీ రాజ్‌గిరీకేనా? బీహార్ సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌

3 Aug, 2022 07:04 IST|Sakshi

పట్నా: బిహార్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహరీ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలిం సీటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి ప్రాజెక్టులు రాజ్‌గిరికే ఎందుకు తరలివెళ్తున్నాయని ప్రశ్నించారు. రాజ్‍గిరి సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలో ఉండటం గమనార్హం. దీంతో వినయ్ బిహారీ సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.

తాను కళలు, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర రాజధాని పట్నాలో నిర్మించాలనుకున్నట్లు వినయ్ చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టును రాజ్‌గిరికి తరలించారని ఆరోపించారు. అలాగే ఫిలిం సిటీని కూడా వాల్మీకి నగర్‌లో నిర్మించాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ దాన్ని కూడా రాజ్‌గిరికి మార్చారాని ఆరోపించారు.

భోజ్‌పురి ఫిలిం మేకర్ అయిన వినయ్ బిహారీ..  తనకంటే ఎక్కువ నితీశ్ కుమార్‌కు ఏమీ తెలియదన్నారు. అక్కడైతే ఫిల్మ్ మేకింగ్‌కి అనువైన వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. అసలు ఈ రెండు ప్రాజెక్టులను రాజ్‌గిరికి ఎందుకు మార్చారో సీఎం, సంబంధిత మంత్రి, బీజేపీ డిప్యూటీ సీఎంలే చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు ఫిలిం సిటీ, క్రికెట్ స్టేడియం పనులు నత్తనడకన సాగుతున్నాయని సీఎంపై వినయ్ బిహారీ విమర్శలు గుప్పించారు. 2014లో మొదలైన ఈ ప్రాజెక్టులు సగం కూడా పూర్తి కాలేదన్నారు. బిహార్‌లో అధికార జేడీయూ, బీజేపీ మిత్రపక్షాలు. అలాంటిది సీఎంపై బీజేపీ ఎ‍మ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
చదవండి: బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్‌!

మరిన్ని వార్తలు