ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్‌

6 Nov, 2020 04:17 IST|Sakshi

పట్నా: ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని పూర్ణియాలో గురువారం ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయను. పదవీ విరమణ చేస్తాను. అంతా బాగున్నప్పుడే మనం తప్పుకోవాలి’అని ఎన్నికల సభలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నితీశ్‌ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల్ని ఈ సారి ఎదుర్కొంటున్నారు.

దీంతో ఓటర్లను ఆకర్షించడానికే చివరి ఎన్నికలంటూ ఒక కొత్త స్టంట్‌కు తెరతీశారని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు.  బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ అయిన యోగి ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సీఏఏని తీసుకువచ్చారంటూ వివాదాన్ని రేపారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్‌ ధ్వజమెత్తారు. ఏమిటీ నాన్సెన్స్‌ ? ఎవరీ చెత్త మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. బిహార్‌లో ముస్లిం మైనార్టీలు నితీశ్‌ పక్షానే ఉన్నారు. యోగి వ్యాఖ్యలతో వారెక్కడ దూరం అవుతారోనన్న భయం ఆయనని వెంటాడుతోంది.

బిహార్‌ అభివృద్ధికి నితీశే ఉండాలి: మోదీ
బిహార్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఎన్డీఏయేపై మాత్రమే పూర్తి నమ్మకం ఉందన్నారు. అరాచక వాతావరణాన్ని సృష్టించిన 2005 ముందు నాటి పాలన పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటోందనీ, సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు