కాంగ్రెస్‌ వస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే!

6 Nov, 2023 05:51 IST|Sakshi

అవినీతి, అక్రమాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కవల పిల్లలే

మీట్‌ ది ప్రెస్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి

ఒక కుటుంబం చేతుల్లో ప్రజాస్వామ్యం బందీ అయింది

కేసీఆర్‌ పాలనను గాలికొదిలేశారు

గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్లా ఆయన ఓటమి ఖాయం

దమ్ముంటే తొమ్మిదేళ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌.. తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వెల్లడి

కవిత అరెస్టు, సోనియాగాంధీ అరెస్టు వంటివి విచారణ సంస్థల బాధ్యత.. బీజేపీకి సంబంధం లేదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మార్పు అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు కాకూడదని, బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పరిస్థితి అంతేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని.. అవినీతి, అక్రమాల్లో కవల పిల్లల వంటివని విమర్శించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో దళిత సీఎం నుంచి దళితబంధు దాకా, ఉద్యోగాల భర్తీ మొదలు నిరుద్యోగ భృతి దాకా.. ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా చాలా రంగాల్లో కేసీఆర్‌ సర్కార్‌ పాలన తూతూమంత్రంగానే సాగిందని ఆరోపించారు.

గత తొమ్మిదేళ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ తనతో బహిరంగచర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేయాలన్న నిర్ణయానికి అనుగుణంగానే తనను అసెంబ్లీకి పోటీచేయొద్దని జాతీయ నాయకత్వం ఆదేశించిందన్నారు. ఆదివారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

సరైన తీర్పు ఇవ్వాలి
కాంగ్రెస్‌ ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు, బీఆర్‌ఎస్‌కు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే. ఈ రెండింటికి వేస్తే ఎంఐఎంకు వేసినట్టే. కేసీఆర్‌ అవినీతి, నయా రాచరిక పాలనతో ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయింది. దేశంలోని అన్ని సమస్యలకు, దోపిడీ, అవినీతి రాజకీయాలకు కారణమైన కాంగ్రెస్‌.. తెలంగాణలో గ్యారంటీలు నెరవేర్చుతామంటే ఎలా నమ్ముతారు? ప్రజలు ప్రలోభాలకు గురికావద్దు. ఓటు ఆయుధంతో సరైన తీర్పు ఇవ్వాలి.

నేరం చేసినవారు జైలుకు వెళ్లాల్సిందే..
ఎమ్మెల్సీ కవిత అరెస్టో, సోనియాగాంధీ అరెస్టో.. ఏదైనా విచారణ సంస్థల బాధ్యత. అది బీజేపీకి సంబంధం లేని అంశం. తప్పు జరిగిన చోట ఆధారాలతో వ్యవస్థ ముందుకెళ్తుంది. నేరం చేసిన వారెవరైనా జైలుకెళ్లాల్సిందే. కాళేశ్వరంగానీ మరే పథకంలోగానీ అవినీతి జరిగిందని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనో లేదా హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆదేశిస్తేనో సీబీఐ విచారణకు అవకాశం ఉంటుంది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇస్తుండటమే దీనికి కారణం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోసం మధ్యాహ్నం 2గంటలకు కేసీఆర్‌ సంతకం పెడితే.. 4 గంటలకల్లా సీబీఐ టీమ్‌ను సిద్ధం చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.

కేసీఆర్‌ వద్ద అంత డబ్బు ఎక్కడిది?
తానే ఓ సూపర్‌ ఇంజనీర్‌ అన్నట్టుగా కేసీఆర్‌ నిపుణుల సూచనలను కాదని కట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. రూ.30వేల కోట్ల ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.1.30 లక్షల కోట్లకు పెంచి.. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన నాయకత్వాన్ని అంగీకరిస్తే అన్ని రాజకీయపార్టీల ఎన్నికల ఖర్చును భరిస్తానని కేసీఆర్‌ చెప్పినట్టు ఒక సీనియర్‌ రిపోర్టర్‌ వెల్లడించారు. అంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల డబ్బు ఒక సీఎం చేతుల్లో ఉందంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు.

కేసీఆర్‌ ఓటమి ఖాయం
తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి, తన కొడుకును సీఎం చేయాలన్న ఆలోచనే తప్ప ప్రజల బాగోగులను కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారు. తనతోనే తెలంగాణ వచ్చినట్టు కేసీఆర్‌ గొప్పలు చెప్తుంటారు. బీజేపీ ఎంపీల మద్దతు లేకుండా ప్రత్యేక రాష్ట్రంఏర్పడేదా? ఉద్యమాలతో అధికారంలోకి వచ్చి.. మరెవరూ ఉద్యమాలు చేయకుండా, తమ గోడు చెప్పుకొనే అవకాశం లేకుండా గొంతు నొక్కేస్తున్నారు. ఈ తీరుపై ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండుచోట్లా కేసీఆర్‌ ఓటమి ఖాయం. కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుచేసి విఫలమయ్యారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహా తీర్పు రిపీట్‌ కాబోతోంది. 

బీసీలంతా కలసి గెలిపించుకుంటారు
తెలంగాణలో బీసీలకు రాజ్యాధికార సాధన లక్ష్యంతోనే మేం పనిచేస్తున్నాం. దేశంలో మొదటిసారిగా బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించాం. రాష్ట్ర జనాభాలో 55శాతం ఉన్న బీసీలు తమ వాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే.. వాళ్లే గెలిపించుకుంటారు. ఈ విషయంలో ఎవరి ప్రభావం పనిచేయదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు బీసీలను అవహేళన చేస్తున్నాయి. జనసేన ఎన్డీయే భాగస్వామ్య పార్టీ. పొత్తుధర్మంగా వారిని కలుపుకొని ముందుకెళ్తాం.

ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం
అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. దుబారా తగ్గించి, అవినీతిని పూర్తిగా అరికడుతుంది. కేసీఆర్‌ కుటుంబభవన్‌గా మారిన ప్రగతిభవన్‌ను ప్రజా ప్రగతిభవన్‌గా మారుస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే సీఎంను తీసుకొస్తాం. డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూపిస్తాం. అవినీతి రహిత వ్యవస్థను నిర్మిస్తాం. ఉద్యోగ నియామకాల కోసం జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తాం. 

వ్యక్తిగత అవసరాల కోసమే వీడుతున్నారు
పార్టీని వీడేవారు వ్యక్తిగత అవసరాలకోసం వెళ్తున్నారు. ఏం ఇబ్బంది లేదు. మాది కేడర్‌ ఆధారిత పార్టీ.  ప్రజలు మాతోనే ఉన్నారు. నామినేషన్ల విత్‌డ్రా తర్వాత మేనిఫెస్టో విడుదల చేయడం మా సంప్రదాయం. ఇప్పటికే అన్ని వర్గాలతో మాట్లాడి సలహాలు తీసుకున్నాం. ఏం చెబుతామో అది చేసి చూపిస్తాం.  

మరిన్ని వార్తలు