స్థానిక ఎన్నికలు: బీజేపీ.. ఓటుకు రేటు

4 Feb, 2021 10:17 IST|Sakshi
గ్రామంలో విచారిస్తున్న పోలీసులు

రూ.5 వేల వంతున బలవంతంగా పంపిణీ

వద్దన్న గిరిజనులకు రూ.10 వేలు ఇస్తామని బీజేపీ ఒత్తిడి

కావలి(నెల్లూరు జిల్లా): ఎన్నికల్లో ఉనికి కోసం బీజేపీ ఓటుకు రేటు నిర్ణయించి విచ్చలవిడిగా ఓట్ల కొనుగోలుకు తెగబడుతోంది. కావలి నియోజకవర్గంలో కావలి, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల పరిధిలో 63 పంచాయతీలు ఉండగా 386 మంది అభ్యర్థులు సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. 636 వార్డులకు 1,617 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో బీజేపీ మద్దతుదారులుగా నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులు చాలా మంది రాజకీయాలకు పూర్తిగా కొత్త. స్థానికంగా వీరికి ఎటువంటి మద్దతు కూడా లేదు. (చదవండి: ‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?)

కేవలం ఓట్ల కొనుగోలే లక్ష్యంగా బీజేపీ నాయకులు వీరిని బరిలో నిలిపారు. ఓటుకు రూ. 5 వేల వంతునైనా ఇచ్చి ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో నోట్ల కట్టలు వెదజల్లుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావలి మండలం లక్ష్మీపురం పంచాయతీలోని గిరిజనులకు ఓటుకు రూ. 5వేల వంతున బలవంతంగా ఇచ్చే ప్రయత్నం చేయడంతో గిరిపుత్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బీజేపీ నాయకులు మంచాలపై పెట్టి వెళ్లిన డబ్బులను రూ.1.24 లక్షలు అధికారులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.(చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..

బీజేపీ జిల్లా అధ్యక్షుడి స్వగ్రామంలోనే..  
కావలి మండలం నెల్లూరు–ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న కావలి మండలం లక్ష్మీపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ స్వగ్రామం. ఆయన తన స్వగ్రామంలో బీజేపీ సర్పంచ్‌ అభ్యర్థిని గెలిపిస్తానని కొద్ది రోజులుగా సవాళ్లు విసురుతున్నాడు. జనవరి 31వ తేదీ అర్థరాత్రి భరత్‌కుమార్‌ కుటుంబ సభ్యులు గ్రామంలోని గిరిజన కాలనీలో ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారి ఇంటికి వెళ్లి ఓటుకు రూ.5 వేల చొప్పున ఇవ్వసాగారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు లేచి బయటకు రాగానే ఈ మాట చెప్పే సరికి, తమకు డబ్బులు వద్దని చెప్పినా బీజేపీ నాయకులు బలవంతంగా ఇళ్లల్లో మంచాలపై నగదు పెట్టేసి వెళ్లిపోయారు. ఇలా రూ.1.25 లక్షలు పంపిణీ చేశారు.

అయితే గిరిజనులు తాము డబ్బులు తీసుకొని ఓటు వేస్తే అభివృద్ధి పనులు అడగలేమని ఆ డబ్బులు మాకొద్దని తీసుకెళ్లమని గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బూచి మాల్యాద్రి, మద్దూరి రవి, గుండ్లపల్లి లక్ష్మీనారాయణకు మొర పెట్టుకున్నారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు ఆ డబ్బులు తీసుకోకపోగా, చాలకపోతే రూ.10 వేల చొప్పున ఇస్తామని అనడంతో గిరిజనులు నిర్ఘాంతపోయారు. ఇక చేసేది లేక ఈ విషయాన్ని బుధవారం అధికారులకు తెలియజేశారు. ఇదే విషయాన్ని కావలిలోని బీజేపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు భరత్‌కుమార్‌ ఇంటికి వచ్చి చెప్పినా, ఆయన వినిపించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు లక్ష్మీపురం గ్రామంలోని గిరిజన కాలనినీకి చేరుకుని వారి నుంచి ఫిర్యాదును అందుకొని నగదును స్వాధీనం చేసుకొన్నారు.    

మరిన్ని వార్తలు