షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. యడ్డీ కుర్చీకి ఎసరు! | Sakshi
Sakshi News home page

25 మంది ఎమ్మెల్యేలు షాక్‌.. యడ్డీ కుర్చీకి ఎసరు!

Published Thu, Feb 4 2021 10:18 AM

25 BJP MLAs Not Attended For BS Yediyurappa Dinner - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విందు భోజనానికి సొంత బీజేపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. బుధవారం బెంగళూరులో తన అధికారిక నివాసం కావేరిలో ఆయన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఏర్పాటు చేశారు. అందరూ తప్పక రావాలని కొన్నిరోజుల నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు తరువాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి గూడుకట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారిని కాదని వలసవాదులకు పదవులు కట్టబెట్టారని బాహాటంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అసంతృప్తిని చల్లార్చేందుకు విందు ఏర్పాటైంది. (యడియూరప్ప స్థానంలో యువ సీఎం!)

గతకొంత కాలంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు రహస్యమంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుల విషయంలో పలువురు తీవ్ర సంతృప్తంగా ఉన్నారు. అంతేకాకుండా యడ్డీని సీఎం కుర్చి నుంచి దించేసి మరో నేతకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పట్టుబడుతున్నారు. తాజాగా సీఎం విందు భోజనానికి సొంత ఎమ్మెల్యేలు రాకపోవడం కన్నడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలో చాలామందికి మంత్రిపదవులు కట్టాబెట్టారు. అయితే సీఎం నిర్ణయం సొంత పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఎవరెవరు రాలేదంటే.. 
రెబెల్‌ సీనియర్‌ ఎమ్మెల్యేలు బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్, సునీల్‌ కుమార్‌తో పాటు 25 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలిసింది. వీరిలో అరవింద బెల్లద్, పూర్ణిమా శ్రీనివాస్, మహంతేశ్‌ దొడ్డనగౌడ పాటిల తదితరులు ఉన్నారు.  

Advertisement
Advertisement