సాగుకు 24 గంటల కరెంటా.. నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా! 

3 Feb, 2023 01:48 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ మంత్రులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల సవాల్‌   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మంత్రులకు సవాల్‌ విసిరారు. చిల్లర, గూండా నాయకులతో తనను సీఎం కేసీఆర్‌ తిట్టిస్తే తిట్టిస్తారేమో కానీ, 24 గంటల కరెంట్‌ ఎక్కడ ఇస్తున్నారో చెప్పలేరని ఎద్దేవా చేశారు.  

కేసీఆర్‌కు 2014, 2023లలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో, అదే సమయంలో తన ఆస్తుల పరిస్థితి ఏమిటో చర్చకు సిద్ధమని ప్రకటించారు. గురువారం మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డిలతో కలిసి ఈటల మీడియాతో మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దింది కేసీఆర్‌ అని, మోసానికి, ,ద్రోహానికి మారుపేరు ఆయనేనని ఆరోపించారు.  

బీసీలకు ఎన్ని మంత్రి పదవులిచ్చారు?: ఓ బీసీ మంత్రి తనను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రంలో 52 శాతమున్న బీసీలకు ఎన్ని మంత్రి పదవులిచ్చారు.. ఏ ఏ శాఖలిచ్చారో చెప్పాలని ఈటల ప్రశ్నించారు. దేశంలో అధిక ద్రవ్యోల్బణం తెలంగాణలోనే ఉందని, రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.5లక్షల కోట్లకుపైగా, తలసరి అప్పు రూ.1.20 లక్షలుగా ఉందని చెప్పారు.

జీఎస్‌డీపీలో రాష్ట్రం అప్పు 2014లో 15 శాతం ఉండగా, అది 2021–22లో 28.8 శాతానికి చేరుకుందన్నారు. కేంద్రంలో 2014లో జీడీపీలో 50.1% అప్పు ఉంటే, 2020–21 కల్లా 48 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రధాని మోదీ వంద లక్షల కోట్లు అప్పు చేశారని కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ లెక్కలపై కేటీఆర్‌ చర్చకు రావాలని చాలెంజ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు