ఇప్పుడు గుర్తొచ్చామా బొజ్జలా..! అంటూ నిలదీత.. జారుకున్న టీడీపీ నేత

4 Aug, 2021 09:12 IST|Sakshi

ఇప్పుడు గుర్తొచ్చామా బొజ్జలా..!

ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ అడుగు పెట్టావు

దళితులంటే చిన్నచూపెందుకు?

బొజ్జల సుధీర్‌ను నిలదీసిన జనం

శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి తనయుడికి చేదు అనుభవం

మీ నాన్న 30 ఏళ్లు మంత్రిగా.. 
ఎమ్మెల్యేగా ఉన్నారు కదా.
ఏ రోజైనా ఇటు వచ్చారా? 
సమస్యలు విన్నారా? 
మేము దళితులమనే మా 
ప్రాంతాన్ని చిన్నచూపు చూశారు.
కనీసం కట్టుకున్న ఇళ్లు కూడా 
దక్కకుండా చేశారు. 
ఇప్పుడు అధికారం లేదని 
సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు.
ఇదేనా ప్రజాసేవ అంటే..? ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయడమెందుకు..? అంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బొజ్జల సుధీర్‌ను స్థానికులు నిలదీయడంతో ఆయన కంగుతిన్నారు. అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమైంది.

సాక్షి, తిరుపతి / శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వంపై బురదజల్లేందుకు వచ్చి ప్రజావ్యతిరేకతతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. శ్రీకాళహస్తి సమీపంలోని రామచంద్రాపురం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 1,748 మందికి ఇందిరమ్మ గృహాలు మొదటి విడత కింద మంజూరు చేశారు. ఆ ప్రాంతానికి రాజీవ్‌నగర్‌ కాలనీగా నామకరణం చేసి, ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. ఆయన హఠాన్మరణంతో గృహనిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనసాగారు. ఆయన మంత్రిగా పలు కీలక పదవులు అలంకరించారు. ఆ సమయంలో రాజీవ్‌నగర్‌ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా  వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే దురుద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

పక్కాగృహాలు అసంపూర్తిగా దర్శనమిస్తుండడంతో అధికారులు పట్టాలను రద్దుచేయడంతోపాటు ముందుగానే నోటీసులిచ్చి లబ్ధిదారులకు తెలియజేశారు. ఇది ఎవరికీ గుర్తుండవనుకుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బొజ్జల సుధీర్‌ ప్రభుత్వంపై బురదజల్లేందుకు శ్రీకాళహస్తిలో పర్యటనకు సిద్ధపడ్డారు. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఒకరు పద్మాలయ చెరువును ఆక్రమించి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఇది తెలుసుకున్న అధికారులు ఆ నిర్మాణాలను తొలగించి పద్మాలయ చెరువులో బోర్డులు నాటారు. ఇది జరిగి పది రోజులైంది. అయితే గత సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న బొజ్జల సుధీర్‌రెడ్డి హడావుడిగా వెళ్లి పద్మాలయ చెరువు ఆక్రమణల విషయమై నానాయాగీ చేశారు. అంతేకాకుండా రాజీవ్‌నగర్‌లో లబ్ధిదారులకు అండగా ఉంటానంటూ మంగళవారం ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం కొంత మందితో అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో.. టీడీపీ ప్రభుత్వంలో రాజీవ్‌నగర్‌ని నిర్మించామని బొజ్జల సుధీర్‌ నోరు జారారు. బొజ్జల మాట విన్న స్థానికులు కొందరు ‘మరో లోకేష్‌ బాబు వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో ఆయన చిన్నగా అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం.  

మరిన్ని వార్తలు