పట్టాభిపురంలో అసభ్య నృత్యాలు.. సీఐ సస్పెన్షన్‌

4 Aug, 2021 11:49 IST|Sakshi

ఓ హోటల్‌లో పుట్టిన రోజు వేడుకలు

నగరంలో రేవ్‌ పార్టీ అంటూ కలకలం

పార్టీకి హాజరైన సీసీఎస్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు

పట్నంబజారు: జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెçన్షన్‌ వేటు పడింది. సేకరించిన సమాచారం ప్రకారం... గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో సోమవారం రాకేష్‌ అనే వ్యక్తి  జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి.

ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్‌ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు. అయితే జరిగిన పార్టీకి అర్బన్‌ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు. ఒకేసారి ఆరుగురు యువతులు, 19 మంది యువకులను తీసుకుని రావటంతో రేవ్‌పార్టీ జరిగిదంటూ కలకలం రేగింది. అయితే దీనిపై స్పందించి పట్టాభిపురం పీఎస్‌ సీఐ ఎస్వీ రాజశేఖర రెడ్డి ఎటువంటి రేవ్‌ పార్టీలు జరగలేదని స్పష్టం చేశారు. తాము అక్కడ జరిగిన తంతుని వీడియో చిత్రీకరించామని, ఎటువంటి అశ్లీల నృత్యాలు జరగలేదని తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే దాడి చేయటం జరిగిందని వివరించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేసినట్లు వివరించారు.

సీఐపై సస్పెన్షన్‌ వేటు
రెస్టారెంట్‌లో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీసీఎస్‌ సీఐ వెంకటేశ్వర్లుపై సస్పెండ్‌ చేస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ తివిక్రమ వర్మ ఆదేశాలు జారీ చేశారు.  సిబ్బంది ఇటువంటి వ్యవహారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన అసభ్య నృత్యాలు, మద్యం పార్టీలో సీఐ పాల్గొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అయితే సీఐ వెంకటేశ్వర్లు పార్టీ జరిగిన సమయంలో పోలీసులే తప్పించారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు దాడి చేసే సమయానికే సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారా.. లేక పోలీసులే తప్పించారా అనే కోణాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు